కొత్తగూడెం ప్రగతి మైదాన్: మావోయిస్టుల అంతానికి పంతం పట్టిన కేంద్రం ఆ దిశగా అడుగులు కాదు.. ఏకంగా పరుగులే పెడుతున్నది. దీంతో వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాస్టర్ మైండ్ హిడ్మా కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో పీఎల్జీఏ చీఫ్ని తుదముట్టించడమే లక్ష్యంగా ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ పురుడుపోసుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) చీఫ్ మడివి హిడ్మాకు సంబంధించిన తాజా చిత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఎవరికీ చిక్కని హిడ్మా చిత్రం వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా కోసం వేల సంఖ్యలో ప్రత్యేక బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి.
పెద్ద తలలే టార్గెట్?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టు పార్టీ నిర్మూలనకు ఇచ్చిన టార్గెట్ మేరకు భద్రతా దళాలు తమ వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ పార్క్ అడవులను వేదికగా చేసుకుని వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఇప్పటివరకు 35 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నేలకొరిగారు. దీనిని పరిశీలిస్తే.. కేవలం మావోయిస్టు పార్టీకి చెందిన పెద్ద తలలే లక్ష్యంగా భద్రతా దళాలు తమ ‘ఆపరేషన్స్’ పంథాను మారుస్తున్నారు.
ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావో యిస్టులు మృతి చెందారు. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఐదుగురి మృతదేహాలతో పాటు రెండు ఏకే-47 గన్లు, ఇతర ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.