బెంగుళూరు: కర్నాటకలో కోవిడ్ వేళ భారీ అక్రమాలు(Covid Scam) జరిగినట్లు తేలింది. వందల కోట్లలో నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు ఆనాటి ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిటీషన్ ఈ రిపోర్టును రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్యకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమీషన్‌కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.
చీఫ్ సెక్రటరీ శాలినీ రాజ్నీష్, అడిషనల్ సెక్రటరీ ఎల్కే అతీక్ నేతృత్వంలోని అధికారుల బృందం జస్టిస్ కున్హా ఇచ్చిన నివేదికను స్టడీ చేయనున్నట్లు మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. మరో నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చేందుకు ఆ కమిటీకి సమయాన్ని కేటాయించారు. వందల కోట్లల్లో నిధులను దుర్వినియోగం చేశారని, అనేక ముఖ్యమైన ఫైళ్లు కనిపించడం లేదని, ఎన్ని ఆదేశాలు ఇచ్చినా.. ఆ రిపోర్టులను కున్హా కమీషన్ ముందు ప్రవేశపెట్టలేదని, సీనియర్ల ఆఫీసర్లతో కూడిన కమిటీ అక్రమాలపై అధ్యయనం చేయనున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు.
సుమారు 1120 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసినట్లు జస్టిస్ కున్హా తన నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో మందులు, ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. జస్టిస్ కున్హా కమీషన్‌ను ఆగస్టు 2023లో ఏర్పాటు చేశారు. కోవిడ్ అక్రమాలు జరిగిన సమయంలో.. కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉన్నట్లు తాజా ప్రభుత్వం ఆరోపించింది.