న్యూఢిల్లీ, జూలై 23: వీఐపీలు, రైల్వే సిబ్బంది, అత్యవసర వైద్య సదుపాయం కోసం ప్రయాణించాల్సిన వారికి కేటాయించే ఎమర్జెన్సీ కోటాకు (ఈక్యూ) సంబంధించిన నిబంధనలను రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇక నుంచి ఈక్యూ కోటా కావాలనుకునే వారు తమ ఈక్యూ టికెట్‌ను ఒక రోజు ముందుగానే సమర్పించాలి. ట్రైన్ బయలుదేరే సమయానికి 8 గంటల ముందుగానే రిజర్వేషన్ చార్ట్‌లను సిద్ధం చేయాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం ఈక్యూల సమర్పించే సమయంలో కూడా మార్పులు చేసింది. 0000 గంటల నుంచి 14:00 గంటల సమయంలో బయలుదేరే అన్ని రైళ్ల ఈక్యూ రిక్వెస్ట్‌లు ప్రయాణానికి ముందు రోజు 12.00 గంటల లోపు ఈక్యూ సెల్‌కు అందాలని రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. అలాగే 14.01 గంటల నుంచి 23.59 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు సంబంధించిన ఈక్యూ రిక్వెస్ట్‌లు ప్రయాణానికి ముందు రోజు 16.00 గంటల లోపు ఈసీ సెల్‌కు అందాలి. బయలుదేరే రోజే ఇచ్చే ఈక్యూ రిక్వెస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని రైల్వే శాఖ స్పష్టం చేసింది.