Farooq Abdullah : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ జైలు నుంచి విడుదల కావడంపై నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రషీద్‌ను విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ముస్లింలను విడుగొట్టేందుకే అసెంబ్లీ ఎన్నికల ముందు రషీద్‌ను జైలు నుంచి విడుదల చేశారని ఆరోపించారు.
ఒకప్పుడు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించిన వాళ్లే ప్రస్తుతం బీజేపీతో జత కట్టారని మండిపడ్డారు. గతంలో అంటే 1987లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను ఫరూక్ అబ్దుల్లా గుర్తుచేశారు. నాడు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించిన వారితోనే నేడు కలిశారని బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం మళ్లీ పేట్రేగిపోతుందని శనివారం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, అయినా రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా గుర్తుచేశారు. ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు ఎలా వస్తున్నాయని ఆయన సందేహం వెలిబుచ్చారు. ఎన్నికల ముందు ఇంజినీర్ రషీద్ జైలు నుంచి విడుదలవుతున్నారంటే ఆయన కచ్చితంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన వ్యక్తేనని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఇంజినీర్ రషీద్ భారీ అధిక్యంతో గెలిచారు.
ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై కొన్ని రోజుల క్రితం ఇంజినీర్ రషీద్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా పైవిధంగా స్పందించారు. కాగా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 18, 25, అక్టోబర్ 5వ తేదీల్లో మూడు విడతల్లో జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.