Madhyapradesh CM : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhyapradesh CM) మోహన్ యాదవ్ (Mohan Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించాలంటే కేవలం ఒక్క వివాహం మాత్రమే చేసుకుని ఉండాలన్నారు. ఈ మేరకు త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ (Uniform Civil Code) ను అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే దీని ఉద్దేశమని అన్నారు.
రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ప్రవేశపెడుతుందని, అప్పుడు ఒకే వివాహం చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్రంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నొక్కి చెప్పారు. కట్నీ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి, ఒకే జెండా ఉండాల్సినప్పుడు, హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకు ఉండాలి..? అందరికీ ఒకే చట్టం ఉండాలి. రామ్‌కు ఒకే వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, రహీమ్‌కు రెండు, మూడు లేదా నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలి..? మన ముస్లిం సోదరీమణులు కూడా మన సోదరీమణులే. ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి ప్రకారం, ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్‌లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది” అని తేల్చిచెప్పారు.
రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెడుతుందని ఆ ప్రాతిపాదిత చట్టం ఏకరీతి న్యాయవ్యవస్థను అందిస్తుందని, తక్షణ ట్రిపుల్ తలాక్ యుగం ముగిసిందని సీఎం పేర్కొన్నారు. కాగా దేశంలో యూసీసీని చట్టబద్ధం చేసి, విజయవంతంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2024 లోనే అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వగా.. 2025 జనవరి 27 నుండి ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, సహజీవనం వంటి అంశాలపై ఇక్కడ అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది.