న్యూఢిల్లీ: ఈ ఏడాది నీట్-యూజీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను చేపట్టే విధానంలో మార్పులు చేయబోతున్నట్టు సమాచారం! ప్రస్తుతం జేఈఈ-మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్టుగా, వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘పరీక్ష నిర్వహణలో తీసుకురావాల్సిన మార్పులపై ఏర్పాటైన సంబంధిత కమిటీ.. ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నది.
అయితే ఆ కమిటీ ఇంకా ఎలాంటి అధికారిక సిఫారసులు చేయలేదు’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై మరో అధికారి మాట్లాడుతూ, ‘దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలంటే 4వేల పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర వసతులు కల్పించాల్సి ఉంటుంది. ఇది ఒక సవాల్‌తో కూడుకున్న అంశం. జేఈఈ-మెయిన్స్‌ను నిర్వహించినట్టు ఆన్లైన్లో నీట్-యూజీని నిర్వహించటం మంచి ఆలోచనే’ అని అన్నారు.