న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తరగతి రాజనీతిశాస్త్ర పాఠ్య పుస్తకం నుంచి తొలగించింది. దీనిపై ప్రముఖ రైతు ఉద్యమకారుడు రాకేశ్ టికాయిత్ ధ్వజమెత్తారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాసి నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. మోదీ సర్కారు తీరుపై కేరళ ప్రభుత్వం సైతం నిప్పులు చెరిగింది. ఎన్సీఈఆర్టీలో రాష్ట్ర ప్రతినిధులకు చోటు కల్పించాలని డిమాండ్ చేసింది. ఎన్సీఈఆర్టీ తొలగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్లో చేర్చాలని నిర్ణయించింది.