BJP | నాసిక్, మే 17: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాసిక్‌లో త్రయంబకేశ్వర్ ఆలయం వద్ద స్థానికులతో కలిసి ముస్లింలు దశాబ్దాలుగా పాటిస్తున్న ఓ ఆచారంపై వివాదం రేపింది. త్రయంబకేశ్వర్ ఆలయం ప్రవేశ ద్వారం వద్దకు కొంత మంది ముస్లింలు దూపం పెట్టేందుకు శనివారం వచ్చారు. అయితే దీన్ని అడ్డుకొన్న ఆలయ భద్రతా సిబ్బంది వారిని వెనక్కు పంపించారు. పైగా ముస్లింలు బలవంతంగా ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేయించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఘటనపై సిట్ దర్యాప్తునకు డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించడం మరింత వివాదంగా మారింది. సకల్ హిందూ సమాజ్‌కు చెందిన కార్యకర్తలు బుధవారం ఆలయ శుద్ధి పేరుతో ప్రాంగణంలో గోమూత్రం చల్లారు.
త్రయంబకేశ్వర్ ఘటనపై మహారాష్ట్ర ముస్లిం నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమని, స్థానిక హిందువులు కూడా దీనిని ఎన్నడూ అడ్డుకోలేదని పేర్కొన్నారు. ఆలయ సమీపంలోని దర్గా వార్షిక ఉత్సవాల సమయంలో ముస్లింలు ఆలయ ద్వారం వద్ద నుంచి దూపం వేయడం సంప్రదాయంగా వస్తున్నదని, తమకు కూడా శివుడి పట్ల విశ్వాసం ఉన్నదని ఉరుసు నిర్వాహకుడు మతీన్ సయ్యద్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారని త్రయంబకేశ్వర్ వాసి, నాసిక్ జిల్లా సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పర్వేజ్ కొక్ని అన్నారు. మరోవైపు ఆచారంలో పాల్గొన్న ముస్లింలను పోలీసులు విచారణకు పిలువగా.. ఆలయంలో గతంలో జరిగిన ఈ సంప్రదాయానికి సంబంధించిన వీడియోలను సమర్పించారు.
త్రయంబకేశ్వర్ ఘటనపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు హిందూత్వ పేరుతో కొన్ని గ్యాంగులను ఏర్పాటు చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ఎవరూ ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించలేదని, కొంతమంది తమ సంప్రదాయాన్ని అనుసరించారని అన్నారు. 100 ఏండ్లుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఆలయం యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు.