హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): భారతదేశానికి జరిగిన అన్యాయంపై తిరుగుబాటు మొదలైంది. బుధవారం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఫేజ్-1 మాత్రమే. ఇలాంటివి ఇంకా రా బోతున్నాయి. బహుశా ఈ యుద్ధం రెండు మూడేండ్ల్లపాటు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు అని విశ్రాంత మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ లాంటి ఘటనలు గతంలో జరిగినా ఈ స్థాయిలో జరగలేదని, పాకిస్థాన్ ఉగ్రవాదుల అరాచకాలకు బదులిచ్చేందుకు సమయం వచ్చిందని తెలిపేందుకే ‘ఆపరేషన్ సిందూర్’ అని ఆయన చెప్పారు. పదకొండేళ్లపాటు భారతసైన్యంలో దేశ సరిహద్దుల్లో సేవలందించిన విశ్రాంత ఎస్పీఎస్ ఒబెరాయ్ ‘నమస్తే తెలంగాణ’తో ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
కార్గిల్ స్ఫూర్తితో సైన్యంలో చేరాను
కార్గిల్ యుద్ధం చూసి చలించిపోయాను. ఆ స్ఫూర్తితోనే డిగ్రీ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరాను. దేశవ్యాప్తంగా 32 మంది ఎన్సీసీ వాళ్లను ఎంపికచేసి, 28 రోజులపాటు ఆర్మీ తరహాలో శిక్షణ ఇచ్చారు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. 2004 నుంచి పదకొండేళ్లపాటు రాజస్థాన్, జమ్ముకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం ప్రాంతాల్లోని సరిహద్దుల్లో పనిచేశాను. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను రూపుమాపడంలో, ఊల్ఫా ఉగ్రవాదులను నిర్మూలించడంలో కీలకంగా పనిచేశాను.
చిన్నారులు, మహిళలకు ప్రాణహాని చేయలే
భారత సైన్యం, మయన్మార్ సైన్యంతో కలిసి ఓ పెద్ద ఆపరేషన్ నిర్వహించాం. ఆ ఆపరేషన్‌లో నేను గ్రౌండ్ లెవల్లో టీమ్ లీడ్ చేశాను. రెండు నెలలపాటు ప్రణాళికలు రచించి నిర్వహించిన ఆపరేషన్ సన్‌రైజ్-1, ఆపరేషన్ సన్‌రైజ్-2లో 66 మంది ఊల్ఫా ఉగ్రవాదులను హతమార్చాం. నేను అస్సాంలో పనిచేస్తున్న సందర్భంలో ఊల్ఫా ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారని సమాచారం రావడంతో దాడి చేసేందుకు వెళ్లాం. అక్కడున్న చిన్నపిల్లలకు, మహిళలకు ఎలాంటి హాని కలిగించకుండా 8 గంటలపాటు వేచి చూసిమరీ ఉగ్రవాదులపై దాడి చేశాం. నేను ఓ చిన్నగదిలో ఉంటే దాని గోడలన్నీ బుల్లెట్ మరకలతోనిండేవి. జమ్ముకశ్మీర్‌లో ఒక సారి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అస్సాంలో మేం వెళ్తున్న దారిలో కాపుకాచి ఉగ్రవాదులు దాడికి దిగారు. వాళ్ల నుంచి తప్పించుకొని ఓ కాలువలో చాలా సేపు తలదాచుకున్నాం. రెండు రోజుల తర్వాత పక్కా ప్రణాళికతో వారిని హతమార్చాం.
గర్వంగా ఫీలయ్యాను
సైనికుల జీవితాలు సాధారణ ప్రజల మాదిరిగా ఉండవు. ఇరవైనాలుగు గంటలు పనిచేస్తునే ఉంటాం. నాతోటి సహచరులు ఉగ్రదాడిలో మరణించినప్పుడు ఎంతగానో బాధపడ్డాను. తిరిగి ముష్కరులపై దాడి చేసేందుకు ప్రణాళిలు రచిస్తూనే ఉంటాం. మరోవైపు చనిపోయిన జవాన్‌ను ఇంటికి చేర్చడంలోనూ బాధ్యతగా విధులు నిర్వహిస్తాం. నా యూనిట్‌లోని ముగ్గురు జవాన్లు ఉగ్రదాడిలో మరణించినప్పుడు మృతదేహాలను ఇంటికి చేర్చే బాధ్యత మా కమాండర్ నాకు అప్పగించారు. వారి స్వగ్రామాల్లో ప్రజలంతా ఒక్కటిగా కలిసి నివాళులర్పిస్తూ, అంతిమయాత్రలో పాల్గొనటం చూసి ఎంతోగర్వంగా ఉప్పొంగాను.