న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ ప్రకారం.. దేశంలో గత 12 ఏండ్లలో అత్యంత పొడి జూన్ నెలగా ఈ ఏడాది నమోదైనది. అలాగే 1901లో దేశవ్యాప్త వర్షపాత రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇది ఐదవ అత్యం త పొడి జూన్ నెలగా నిలిచింది. భారత వాతావరణ శాఖ జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఇది ఈ ఏడాది పంటలు విత్తే ప్రక్రియ పురోగతిపై ఆందోళనలు పెంచుతున్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వేసవి పంటలు సాగు చేసిన విస్తీర్ణం 2025 ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 23 శాతం తగ్గింది. అలాగే వరినాట్లు పావువంతు తగ్గాయి. పంటలు విత్తడానికి మిలియన్ల మంది రైతులు సీజనల్ రుతుపవనాలపైనే ఆధారపడుతారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 30 నాటికి రైతులు 18.27 మిలియన్ హెక్టార్లలో వేసవి పంటలు వేశారు. గత ఏడాది ఇదేకాలంలో ఇది 23.65 మిలియన్ హెక్టార్లుగా ఉన్నది. భారతదేశంలోని ప్రధాన పంటలు నైరుతి రుతుపవనాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఇది సాధారణంగా భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం అందిస్తుంది.
25 శాతం తగ్గిన పంటల సాగు
ఈ సంవత్సరం రుతుపవనాల రాక మూడు రోజులు ఆలస్యమైంది. పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతి సుమారు రెండు వారాలపాటు మందగించింది. దీనివల్ల అనేక వ్యవసాయ ప్రాంతాల్లో పొలం దున్నడం, విత్తడం ఆలస్యమైంది. వరినాట్లు మరింత తీవ్రంగా మందగించాయి. ఈ సీజన్లో రైతులు ఇప్పటివరకు 2.58 మిలియన్ హెక్టార్లలో వరి వేశారు. అంతకుముందు ఏడాది ఇది 3.44 మిలియన్ హెక్టార్లుగా ఉన్నది. దేశంలో నికర సాగుభూమిలో దాదాపు సగానికి పైగా ప్రాంతానికి ఎటువంటి నిశ్చితమైన నీటి పారుదల వసతి లేదు. ఆ భూములు పూర్తిగా వర్షపాతంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే మిలియన్ల మంది రైతులకు రుతుపవనాల సమయం, విస్తృతి చాలా కీలకం. రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల దేశీయంగా నూనెగింజల ఉత్పత్తి కూడా తగ్గుతుందని, దీనివల్ల దిగుమతి చేసుకొనే వంట నూనెలపై దేశం ఆధారపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే పంట కోతలపై దీని తుది ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా అస్పష్టంగానే ఉన్నది. రుతుపవనాల కాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. కాబట్టి వర్షపాతం పుంజుకోవడానికి, ఆలస్యమైన విత్తే ప్రక్రియను రైతులు భర్తీ చేయడానికి ఇంకా సమయం ఉన్నది.
1901 తర్వాత ఐదో అత్యంత పొడి జూన్..
జూన్ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 92 శాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేయ గా, ఆ అంచనా కంటే 39.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. భారతదేశానికి 1901 తర్వాత ఇది ఐదవ అత్యంత పొడి జూన్. 12 ఏండ్లలో అత్యంత పొడి జూన్ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. కేవలం 1905, 1926, 2009, 2014లో మాత్రమే జూన్ నెలలు ఇంతకంటే పొడిగా ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి భారతదేశ రుతుపవనాల కాలంలో అత్యంత తడి నెల అయిన జూలైపై మళ్లింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ముప్పు ఉన్న 315 జిల్లాలను అధికారులు గుర్తించారని, స్వల్పకాలిక పంటలు, తక్కువ నీటి వినియోగం రకాలు, బలమైన నీటి సంరక్షణతో కూడిన అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు.