ఇండోర్: వీపు మీద బ్యాగు, చక్రాల ఇనుప బండిలో కూర్చుని బూట్లలో రెండు చేతులు పెట్టుకుని తోసుకుంటూ వీధుల్లో తిరిగే ఆ వికలాంగుడు ఎవరినీ నోరు తెరిచి అడుక్కోడు. అయితే అతని దీనస్థితిని చూసి దాతలే జాలితో చిల్లర డబ్బులు, నోట్లు వేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బిజీగా ఉండే సరాఫా మార్కెట్లో మాత్రమే అతడు యాచన సాగిస్తాడు. మంగీలాల్ అనే ఆ వికలాంగ యాచకుడు కోటీశ్వరుడు. అతని పేరుపైన ప్రభుత్వం కేటాయించిన ఇంటితోసహా మూడు ఇండ్లు ఉన్నాయి. మూడు సొంత ఆటోరిక్షాలు, ఓ మారుతీ సుజుకీ-డిజైర్ కారు ఉన్నాయి. యాచకులు లేని నగరంగా ఇండోర్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమంలో మంగీలాల్ సంపద వివరాలు బయటపడ్డాయి.
సరాఫా ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న మంగీలాల్ ఓ కుష్ఠు రోగి అని సమాచారం అందడంతో అతడిని పట్టుకుని చికిత్సాలయానికి తరలించడానికి అధికారులు సరాఫా ప్రాంతంలో శనివారం రాత్రి కాపుకాశారు. రాత్రి 9-10 గంటల ప్రాంతంలో తాము వెదుకుతున్న మంగీలాల్ వారికి చిక్కాడు. ఏదో సాధారణ కేసుగా భావించిన అధికారులకు కళ్లు తిరిగే వాస్తవాలు తెలిశాయి. యాచక వృత్తిలో రాటుదేలిన మంగీలాల్ ఎవరినీ నోరు తెరిచి డబ్బులు అడగడు. అతని దీనస్థితిని చూసి ప్రజలే స్వచ్ఛందంగా దానం చేసేవారు. అలా రోజుకు రూ. 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తాడు. ఆ తర్వాత చీకటిపడ్డాకే అతని అసలు వృత్తి మొదలవుతుంది. సరాఫా మార్కెట్లో చిరు వ్యాపారులకు రోజు వడ్డీ, వారం వడ్డీ కింద రుణాలు ఇచ్చి వాటిని సాయంత్రం చీకటిపడ్డాక వసూలు చేసుకుంటాడు. అలా రూ. 4-5 లక్షలు వడ్డీకి తిప్పుతూ రోజుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు వడ్డీలు వసూలుచేస్తాడు. ఒకప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేని మంగీలాల్ యాచన ద్వారా సంపాదించిన డబ్బును వడ్డీకి తిప్పి సంపన్నులు నివసించే ప్రాంతాలలో ఓ మూడంతస్తుల భవనంతోసహా మూడు ఇండ్లకు ఓనర్ అయ్యాడు.