హైదరాబాద్ : జనవాసాల మధ్య ఉన్న భారీ మొబైల్ టవర్(Mobile tower )ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ వింత సంఘటన స్థానికులతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. 132 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్‌తో పాటు 15 కేవీఏ జనరేటర్‌ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టపగలు.. బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఈ దొంగతనాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లోని(Bihar )బక్సర్ జిల్లా డుమ్రాన్‌లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..కొన్ని సంవత్సరాలు పనిచేయకుండా నిలిచిపోయిన మొబైల్ టవర్‌ను మరమ్మతులు చేయడానికి జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(GTL Infrastructure)అధికారులు, సిబ్బంది డుమ్రాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా 132 అడుగుల మొబైల్ టవర్ కనిపించలేదు. ఒకప్పుడు భారీ నిర్మాణం ఉన్న చోట వారికి ఖాళీ స్థలం తప్ప మరేమీ కనిపించకపోడంతో అందరు షాక్‌కు గురయ్యారు. టవర్‌తో పాటు ఇతర సాంకేతిక పరికరాలు కూడా అదృశ్యమయ్యాయి.
వెంటనే జీటీఎల్ కంపెనీ ప్రతినిధి డుమ్రాన్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, దొంగలు పథకం ప్రకారం కొద్ది రోజులుగా టవర్, జనరేటర్‌కు సంబంధించిన పరికరాలను క్రమ పద్ధతిలో విడదీశారు. ఈ తతంగాన్ని చూసిన స్థానికులు మొబైల్ టవర్ కార్మికులే అధికారికంగా వాటిని తొలగిస్తున్నారని భావించారు. తీరా అది కంపెనీ వాళ్లు కాదు దొంగలు అని తెలిసేసరికి విస్తుపోవడం జనం వంతయింది.