Ghaziabad | దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం. అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ఇంట్లో ఏకంగా 20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను చోరీ చేసి.. కొరియర్ ద్వారా 5లక్షల విలువ గల ఆభరణాలను యజమానికే తిరిగి పంపించాడు. వింటుంటే విచిత్రంగా ఉంది కదూ..! మీరు విన్నది నిజమే. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజానగర్ ఎక్స్‌టెన్సన్ పరిధిలోని లూటెడ్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రీతి సిరోహి.. గత నెల 23వ తేదీన దీపావళి పండగ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. 27న తిరిగి వచ్చి చూస్తే.. ఇల్లంతా చెల్లాచెదురుగా కనిపించింది. ఇంట్లో బీరువాలో ఉన్న నగలు, కొన్ని వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో షాకైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు… సొసైటీలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో దొంగ ఆ ఇంటికి వచ్చి వెళ్లే దృశ్యాలు కనిపించాయి.
ఇంతలోనే అక్టోబర్ 31న ఆ ఇంటికి కొరియర్ ద్వారా ఓ పార్శిల్ రావడం కలకలం రేగింది. అందులో ఏముందోనన్న భయంతో ఇంటి యజమాని.. ఆ పార్శిల్‌ను పోలీసులకు ఇచ్చారు. తెరచి చూడగా అందులో దొంగతనానికి గురైన కొన్ని ఆభరణాలు కనిపించాయి. అయితే, దొంగ 20లక్షల రూపాయల విలువ గల ఆభరణాలను దొంగిలించి.. రూ.5లక్షల నగలను తిరిగి పంపించినట్లు పోలీసులు తెలిపారు.