Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) లో కాంచెన్జుంగా ఎక్స్‌ప్రెస్ (Kanchenjunga Express) రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు. రైల్వే శాఖకు ప్రయాణికుల సౌకర్యాలతో పనిలేదని, రైల్వే సిబ్బంది అంటే లెక్కలేదని ఆమె విమర్శించారు. రైల్వే ఉద్యోగులకు, అధికారులకు తన అండ ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
రైలు ప్రమాదంపై మమత మాట్లాడుతూ.. ‘రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను పట్టించుకోదు. రైల్వే అధికారులు, రైల్వే ఇంజినీర్లు, రైల్వే సాంకేతిక సిబ్బంది, రైల్వే కార్మికుల బాగోగులు వాళ్లకు పట్టవు. ఇప్పటికే వాళ్లు సమస్యల్లో ఉన్నారు. వాళ్ల పాత పెన్షన్‌ను కూడా ఉపసంహరించారు’ అని చెప్పారు. ‘నేను పూర్తిగా రైల్వే ఉద్యోగులు, రైల్వే అధికారుల వైపే ఉంటా. వాళ్లు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఎన్నికలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు’ అని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఎలా గెలుద్దాం అనే రంది తప్ప మరో పట్టింపులేదని మమత మండిపడ్డారు. ‘ఎలా హ్యాకింగ్ చేద్దాం..? అవకతవకలకు ఎలా పాల్పడుదాం..? ఎన్నికల్లో ఎలా రిగ్గింగ్ చేద్దాం..?’ అనే వాటి మీదనే కేంద్రానికి ధ్యాస ఎక్కువగా ఉన్నదని ఆమె ఎద్దేవా చేశారు. కాబట్టి కేంద్రం ఉచిత ప్రేలాపనలు మానుకుని పరిపాలనకు సమయం కేటాయించాలని హితవు పలికారు. కాగా, ఇవాళ డార్జిలింగ్‌లో కాంచన్ ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 15 బోగీలు పట్టాలు తప్పాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.