e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Independence Day: ఆ గ్రామాల్లో ఆగ‌స్ట్ 18న స్వాతంత్ర్య వేడుక‌లు.. ఎక్క‌డ‌? ఎందుకు?

Independence Day: ఆ గ్రామాల్లో ఆగ‌స్ట్ 18న స్వాతంత్ర్య వేడుక‌లు.. ఎక్క‌డ‌? ఎందుకు?

కోల్‌క‌తా: 75 ఏళ్లుగా దేశ‌మంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుక‌లు ( Independence Day ) జ‌రుపుకుంటోంది. భ‌ర‌తమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ప‌ట్ట‌ణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు రోజులు ఆల‌స్యంగా ఆగ‌స్ట్ 18న స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటాయి. 23 ఏళ్లుగా అక్క‌డ ఇదే ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీని వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణం, చాలా మందికి తెలియ‌ని ఓ చ‌రిత్ర దాగి ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి.

ఎవ‌రు వీళ్లు?

- Advertisement -

ప‌శ్చిమ బెంగాల్‌లోని షిబ్నిబాస్ ప‌ట్ట‌ణ‌మ‌ది. మాతాభంగా న‌దికి ఉప‌న‌ది అయిన చుర్నీ న‌దీ తీరంలో.. ఇండియా, బంగ్లాదేశ్‌ల స‌రిహ‌ద్దులో ఉంటుంది. బెంగాల్‌లోని న‌దియా జిల్లాలోని ఈ ప‌ట్ట‌ణంతోపాటు ప‌లు ఇత‌ర గ్రామాలు ఆగ‌స్ట్ 15న కాకుండా భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఆగ‌స్ట్ 18న జ‌రుపుకుంటాయి.

ఎందుకిలా?

1947, ఆగ‌స్ట్ 15న ఇండియాకు స్వాతంత్ర్యం వ‌చ్చిన విష‌యం తెలుసు క‌దా. అదే స‌మ‌యంలో దేశం కూడా రెండుగా విడిపోయింది. ఇండియాతోపాటు వెస్ట్ పాకిస్థాన్‌, ఈస్ట్ పాకిస్థాన్ ప్ర‌త్యేక దేశాలుగా ఏర్ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో వైస్‌రాయ్ మౌంట్‌బాటెన్ దేశాల స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించే బాధ్య‌త‌ను సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్ప‌గించారు. ఆయ‌న బెంగాల్‌లోని మాల్దా, న‌డియా జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల‌ను అప్ప‌టి ఈస్ట్ పాకిస్థాన్ (బంగ్లాదేశ్‌)లో క‌లిపేశారు. ఈ ప్రాంతాల్లో మెజార్టీ హిందువులే. వీళ్లంతా త‌మ‌ను ఇండియాలో క‌ల‌పాల‌ని తీవ్ర ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. విభ‌జ‌న సంద‌ర్భంగా చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో ఈస్ట్ పాకిస్థాన్‌లోని ఈ హిందువులు త‌మకు ధ‌న‌, ప్రాణ న‌ష్టాలు క‌లిగే ప్ర‌మాదం ఉందంటూ నిర‌స‌లు తెలిపారు.

దీంతో శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీతోపాటు న‌దియాలోని రాజ‌కుటుంబ స‌భ్యులు ఈ విష‌యాన్ని మౌంట్‌బాటెన్ దృష్టికి తీసుకెళ్లారు. అక్క‌డి నిర‌స‌న‌ల గురించి తెలుసుకున్న మౌంట్‌బాటెన్‌.. మ్యాప్‌ను మార్చాల‌ని ఆదేశించారు. దీంతో హిందువులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాలు తిరిగి ఇండియాలో క‌లిశాయి. 1947, ఆగ‌స్ట్ 17 అర్ధ‌రాత్రి స‌మ‌యానికి ఈ కొత్త మ్యాప్ సిద్ధ‌మైంది. హిందువులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాలు ఇండియాలో.. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఈస్ట్ పాకిస్థాన్‌లో క‌లిశాయి. ఆగ‌స్ట్ 17 అర్ధ‌రాత్రికి మ‌న దేశ త్రివ‌ర్ణ ప‌తాకం అక్క‌డికి చేర‌గా.. తొలిసారి ఆగ‌స్ట్ 18న అక్క‌డ ఎగ‌రేశారు. దీంతో త‌మ చ‌రిత్ర‌లో ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న ఈ రోజునే వాళ్లు ఇండిపెండెన్స్ డేగా గుర్తిస్తున్నారు.

ఈ చ‌రిత్ర బ‌య‌ట‌పెట్టింది ఆయ‌నే..

షిబ్నిబాస్ ప‌ట్ట‌ణ వాస్త‌వ్యుడు, చ‌రిత్ర‌కారుడు అయిన‌ అంజ‌న్ సుకుల్‌తోపాటు ప‌లువురు ఈ అంశంపై చాలా అధ్య‌య‌నం చేశారు. ఈ క్లిష్ట‌మైన చ‌రిత్ర గురించి అంజ‌న్ ఇలా వివ‌రించారు. ఆ స‌మ‌యంలో న‌దియా ఐదు స‌బ్ డివిజ‌న్లుగా ఉంది. రాణాఘాట్‌, కృష్ణాన‌గ‌ర్‌, మెహ‌ర్‌పూర్ చౌడ‌నాగా, కుష్తియా స‌బ్ డివిజ‌న్లు ఉండ‌గా.. వీటిలో చివ‌రి మూడు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మంది హిందువులే ఉన్నారు. ఈ చ‌రిత్ర‌ను నేను మా తాత నుంచి తెలుసుకున్నాను. ఆయన పేరు ప్ర‌మ‌త‌నాథ్ సుకుల్‌. మ‌న‌కు నిజ‌మైన స్వాతంత్ర్య ఆగ‌స్ట్ 18నే వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పేవారు. మ‌రి ఆ రోజునే మ‌నం ఎందుకు స్వాతంత్ర్య వేడుక‌లు జ‌రుపుకోకూడ‌దు అన్న ఆలోచ‌న నాకు వ‌చ్చింది అని సుకుల్ చెప్పారు.

ఇందులో పీవీ పాత్ర ఏంటి?

అప్ప‌టి నుంచీ ఆయ‌న ఈ చ‌రిత్ర‌కు ఆధారాలు వెతికే ప‌నిలో ప‌డ్డారు. చివ‌రికి రైట‌ర్స్ బిల్డింగ్‌లో ఆయ‌న‌కు కావాల్సిన ఓ పుస్త‌కం దొరికింది. న‌దియార్ స్వాధీన‌త అనే పేరుతో ఉన్న ఆ బుక్ ఈ చ‌రిత్ర గురించి వివ‌రించింది. 1991లో ఆయ‌న ఈ బుక్‌ను గుర్తించారు. ఆ ఆధారాన్ని ప‌ట్టుకొని ఆయ‌న అప్ప‌టి ప్ర‌ధాని పీవీ నర్సింహారావు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. అప్ప‌టి బెంగాల్ ముఖ్య‌మంత్రి జ్యోతి బ‌సు. ఆగ‌స్ట్ 18న తాము స్వాతంత్ర్య వేడుక‌లు జ‌రుపుకుంటామ‌న్న అభ్య‌ర్థ‌న‌ను జ్యోతి బ‌సు నిరాక‌రించారు.

దీంతో సుకుల్ పీవీ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఈ 367 పేజీల పుస్త‌కాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత చాలా కాలానికి ప్ర‌ధాని పీవీ ఈ ప్ర‌తిపాద‌న‌కు అంగీక‌రించారు. దీంతో 1998 నుంచి న‌దియాలోని ఈ ప్రాంతాల‌తోపాటు ఉత్త‌ర 24 ప‌రిగ‌ణాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆగ‌స్ట్ 18న స్వాతంత్ర్య వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. ఆగ‌స్ట్ 15న దేశ‌మంతా వేడుక‌లు జ‌రుపుకునే వేళ‌.. వీరు ఏదో నామ్‌కే వాస్తే సంబ‌రాలు చేసుకున్నా.. అస‌లు వేడుక‌లు మాత్రం ఆగ‌స్ట్ 18నే ఘ‌నంగా జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement