రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి టీఆర్పీ గేమ్ జోన్ యజమాని, నిందితుడు యువరాజ్ హరి సింగ్ సోలంకి పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడు. ‘ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయి’ అని నవ్వుతూ వ్యాఖ్యానించడంపై స్థానిక కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తూ కోర్టులోకి ప్రవేశించిన సోలంకి.. కొద్ది క్షణాల్లోనే నవ్వడం ప్రారంభించాడని, ఈ తరహా ఘటనలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ గోకని పేర్కొన్నారు.
అగ్నిప్రమాద ఘటనలో అరెస్టు చేసిన సోలంకితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిని న్యాయ స్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది. దర్యాప్తునకు నిందితులు సహకరించడం లేదని, ఏ పత్రాల గురించి అడిగినా సమాధానాన్ని దాటవేస్తున్నారని, అవి మంటల్లో కాలిపోయాయని చెబుతున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ గోకని పేర్కొన్నారు. కాగా, రాజ్కోట్ అగ్నిప్రమాదంలో గేమ్ జోన్ సహ యజమానుల్లో ఒకరైన ప్రకాశ్ హిరన్ కూడా మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు డీఎన్ఏ పరీక్షలో తేలిందని తెలిపారు.