అమరావతి : షెడ్యూల్డు కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆయన ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస్ అధికారి పిల్లలను, పేద రైతు కూలీ సంతానాన్ని సమానంగా చూడకూడదని స్పష్టం చేశారు. ఇంద్ర సాహ్నీ కేసులో వచ్చిన తీర్పులో కనిపించినట్లుగా, తాను క్రిమీలేయర్ భావనను తీసుకున్నానని చెప్పారు. ఈ విషయంలో తన తీర్పుపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)లకు వర్తించే దానినే ఎస్సీలకు కూడా వర్తింపజేయాలన్నారు.
జస్టిస్ గవాయ్ 2024లో ఏం చెప్పారంటే, ఎస్సీలు, ఎస్టీలలో క్రిమీలేయర్ను గుర్తించడానికి, వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలను నిరాకరించడానికి ఓ విధానాన్ని రాష్ర్టాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం స్థిరమైనది కాదని చెప్పారు. రాజ్యాంగం నిరంతరం పరిణామం చెందాలని, సహజసిద్ధంగా ఉండాలని, అత్యాధునిక సజీవ పత్రంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారని తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించే అవకాశాన్ని అధికరణ 368 ఇచ్చిందన్నారు.