Lok Sabha | ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్ సింగ్ బుధవారం వెల్లడించారు. లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ్యే ఖాళీలను భర్తీ చేసే విధానం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు.. సంస్థలు పదవీ విరమణ వయసులో మార్పులు చేయాలని కోరారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. జాతీయ మండలి (జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం) సిబ్బంది వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదన్నారు.
కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు వివరాలు, పదవీ విరమణ వయసు తేడాలకు కారణాలను వివరించాలని కోరగా.. ఈ విషయం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని.. అలాంటి డేటా ఏదీ కేంద్రం ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజుల కిందట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచనుందని వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్తలను కేంద్రం ఖండించింది. పదవీ విరమణ వయసును పెంచనున్నారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుకూలంగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వలోని మంత్రిత్వ శాఖలు, ఆయా విభాగాలను ఆదేశిస్తున్నట్లు చెప్పింది.