రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”బిహార్ వెనుకబడిన రాష్ట్రమే. ఇది నిజం. ఈ విషయాన్ని ఒప్పుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అందుకే మేము ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడుతున్నామని, ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను చేస్తున్నామని వివరించారు. జనతా దర్బార్ లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ప్రజలను కలుసుకొని, వారి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే నీతీ ఆయోగ్ కూడా బిహార్ వెనుకబడిన రాష్ట్రమే అని ఒప్పుకుందని, అందుకే తాము ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తాము అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నామని, మహిళల అభివృద్ధికి కూడా పాటుపడుతున్నామని వివరించారు. 2005 తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం విశేషంగా పురోభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. అలాగే అల్లర్లు, బందిపోట్లు కూడా తగ్గిపోయాయని నితీశ్ వివరించారు.