Nitin Gadkari | రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు ప్రపంచంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఏ సమయంలోనైనా యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ‘బియాండ్ బోర్డర్స్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద అగ్రరాజ్యాల నియంతృత్వం, నిరంకుశత్వం కారణంగా సమన్వయం, సామరస్యం, ప్రేమ కనుమరుగవుతున్నాయన్నారు. నేడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణపూరిత వాతావరణ ఉందన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని.. ఏ సమయంలోనైనా యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. భారత్ బుద్ధుడి భూమి అని, ఇది ప్రపంచానికి సత్యం, అహింస, శాంతి సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు. యుద్ధ సాంకేతికత ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు ట్యాంకులు, సాంప్రదాయ విమానాలు ఉపయోగం తక్కువగా ఉందని.. అయితే మిస్సైల్స్, డ్రోన్ల వంటి ఆధునిక ఆయుధాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇప్పుడు మిస్సైల్స్‌ను జనవాసాలపై వేస్తున్నారని.. దాంతో మానవాళి రక్షించడం కష్టమవుతుందన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో చర్చించాల్సిన తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు.