న్యూఢిల్లీ: 2020 నార్త్ఈస్ట్ ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆ కేసుపై విచారణ జరిగింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షార్జీల్ ఇమామ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలకు చెందిన వీడియోలను ఇవాళ సుప్రీంకోర్టులో ప్రదర్శించారు.
ఆ సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో డాక్టర్లు, ఇంజినీర్లు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలేదని, వాళ్లు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, ఇదో ట్రెండ్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు చెందిన వీడియోలను కోర్టుకు చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వేర్వేరు ప్రదేశాల్లో షార్జీల్ ఇమామ్ చేసిన ప్రసంగాలకు చెందిన వీడియోలను కోర్టులో ప్రదర్శించారు.
షార్జీల్ ఇమామ్ ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అని ఏఎస్జీ పేర్కొన్నారు. జస్టిస్ అరవింద్ కుమార్, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు వింటున్నది. నిందితులు చేసిన ప్రసంగాలకు చెందిన అంశం ఛార్జ్‌షీట్‌లో ఉందా అని జస్టిస్ కుమార్ ప్రశ్నించారు. దానికి ఏఎస్జీ అవును అని సమాధానం ఇచ్చారు. షార్జీల్‌పై యూఏపీఏ కేసు బుక్ చేశారు. 2020 ఫిబ్రవరి హింసకు మైస్టర్మైండ్గా తేల్చారు.
ఆ అల్లర్లలో 53 మంది చనిపోగా, 700 మంది గాయపడ్డారు.