న్యూఢిలీ, డిసెంబర్ 8: ఇటీవలి కాలంలో సంపన్నులు డెస్టినేషన్ వెడ్డింగ్‌పై మనసు పారేసుకుంటున్నారు. ఇందుకోసం విదేశాలను ఎంచుకుంటున్నారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ, టాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మరికొందరు పింక్‌సిటీ జైపూర్‌ను ఎంచుకుంటున్నారు. వీరేకాదు, మరెంతోమంది ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్‌పై మోజు పడుతున్నారు. అయితే, విదేశాల్లో జరిగే ఇలాంటి వివాహాల వల్ల దేశానికి పైసా అదాయం లేకపోగా ఆయా దేశాలు లాభపడుతున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ సరికొత్త పిలుపునిచ్చారు. ‘మేకిన్ ఇండియా’ ఉద్యమంలానే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేవభూమి ఉత్తరాఖండ్‌లో 5 వేల డెస్టినేషన్ వివాహాలు జరిగితే రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని, కొత్త మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఓ జంటను కలిపేది దేవుడే అని నమ్మే మనం కొత్త జీవితాన్ని (వివాహం) విదేశాల్లో ఎందుకు ప్రారంభించాలని ప్రశ్నించారు. ‘మేకిన్ ఇండియా’ ఉద్యమంలానే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.