Eknath Shinde | ముంబై, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా కూటమి నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం పుణె పర్యటనలో ఉండగా షిండే మొహం చాటేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. గత కొంత కాలంగా బీజేపీ నాయకత్వంపై షిండే అసంతృప్తిగా ఉన్నట్టు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి పదవి విషయంలో షిండే, ఫడ్నవీస్ మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన కొన్ని క్యాబినెట్ సమావేశాలకు కూడా షిండే గైర్హాజరయ్యారు. ‘నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. నేనేం చేయగలనో మీరంతా 2022లో చూశారు’ అంటూ శుక్రవారం షిండే చేసిన ప్రకటన కూడా పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. షిండే ప్రకటన మహా కూటమి మంచి కోసమేనని చెబుతున్నా.. మహా కూటమికి ఇది హెచ్చరిక అన్న వాదన కూడా వినిపిస్తోంది.