న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు 12 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం తెల్లవారుజామున లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు మైనారిటీలకు ప్రయోజనకరమని అధికార ఎన్డీఏ బలంగా వాదించగా ప్రతిపక్షాలు దీన్ని ముస్లిం వ్యతిరేకిగా అభివర్ణించాయి. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలన్నీ మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురికాగా బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడడంతో వక్ఫ్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.
వక్ఫ్(సవరణ) బిల్లును మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముస్లింల హక్కులను ప్రభుత్వం గుంజుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ముస్లిం మహిళలకు సాధికారత తీసుకురావడంతోపాటు అన్ని ముస్లిం తెగల హక్కులను ఇది పరిరక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ప్రతిపక్ష సభ్యులు నల్ల చొక్కాలు ధరించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ బిల్లు ఉద్దేశమని రిజిజు తెలిపారు.
బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా వక్ఫ్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చివేసిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. తాము మాటల్లో చెప్పమని, చేతల్లో చూపిస్తామని, ముస్లింల సంక్షేమం కోసం పాటుపడేది తాము మాత్రమేనని ఆయన తెలిపారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ విషయంలో బిజూ జనతా దళ్(బీజేడీ) తన వైఖరిని మార్చుకుంది. ఆత్మసాక్షి ప్రబోధానుసారం ఓటింగ్‌లో పాల్గొనాలని బీజేడీ తన సభ్యులకు సూచించింది. మైనారిటీ మతస్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తాము నిర్ణయం తీసుకున్నామని బీజేడీ పేర్కొంది. లోక్‌సభ తరహాలోనే సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశం ఉంది.
లోక్‌సభలో గురువారం ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ తాము సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటనకు విపక్ష ఏఐఏడీఎంకే సంఘీభావం తెలపగా, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
సమాజ్‌వాదీపార్టీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవ భావంతో చూడాలని, భారత్ నిరంకుశ రాజ్యంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. దేశంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, తమకు అన్యాయం జరుగుతోందని అధిక సంఖ్యలో ప్రజలు భావిస్తే వారిని బుజ్జగించడానికి తర్వాత తీసుకునే చర్యల వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ఆర్జేడీ సభ్యుడు ప్రొఫెసర్ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు దేశం క్రమంగా మారుతోందని, ఆ పరిస్థితి పూర్తిగా ఏర్పడితే అది ప్రతిపక్షానికే కాక అధికార పక్షానికి కూడా చేటు చేస్తుందని అన్నారు.
ఆ పరిస్థితి రానివ్వవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ప్రధాని, జేడీఎస్ ఎంపీ హెచ్డీ దేవెగౌడ చర్చలో పాల్గొంటూ ఒక మతానికి విరాళంగా ఇచ్చిన భూమిని సంపన్నులు, శక్తివంతులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ బిల్లుకు తన సంపూర్ణ మద్దతును ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని అభివర్ణించారు. తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేందుకు సమాజంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, పునరేకీకరణను తీసుకువచ్చేందుకే మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు.