కోల్‌కతా, ఏప్రిల్ 30: ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని పేర్కొంది. కొందరు వ్యక్తులు ఏ పార్టీ నేతలు అక్కడ లేకుండా స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపర్చిన ఈవీఎంలను తెరుస్తున్న వీడియో ఫుటేజ్‌ను టీఎంసీ ఎక్స్‌లో విడుదల చేస్తూ బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కుతో భారీ ఎన్నికల మోసం జరిగిందని ఆరోపించింది.
పేర్ల తొలగింపు, ఓటర్లను బెదిరించడం నుంచి ఈవీఎంలను తారుమారు చేయడం వరకు ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు ముదిరాయని, ఇది ఒక నిస్సహాయక చర్య అని టీఎంసీ విమర్శించింది. టీఎంసీ ఆరోపణతో పార్టీ వర్గాలు ఎన్నికల సంఘం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీఎంసీ నేతలు శశి పంజా, కునాల్ ఘోష్‌లు బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం బయట ధర్నా ప్రారంభించారు. కాగా, బెనర్జీ భవానీపూర్, దక్షిణ కోల్‌కతాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన షెకావత్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్‌కు చేరుకున్నారు.
తాజా ఆరోపణలతో పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌంటింగ్ జరిగే మే 4వ తేదీ వరకు పార్టీ వర్గాలు నిరంతరం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గస్తీ నిర్వహించాలని పార్టీ వర్గాలకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో విజయం పట్ల మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 సీట్లలో విజయం సాధిస్తామని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో నాయకులు, పార్టీ వర్గాలు బ్యాలెట్ బాక్స్‌లు ఉంచిన ప్రాంతంపై నిఘా ఉంచి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
కౌంటింగ్‌కు ముందే స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్‌లను బీజేపీ తెరుస్తున్నదంటూ టీఎంసీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం గురువారం ఖండించింది. స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపర్చిన ఈవీఎంలన్నీ సురక్షితంగా, భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. టీఎంసీ వీడియోలో చూపింది పోస్టల్ బ్యాలెట్ల కోసం ఉద్దేశించిన మరో స్ట్రాంగ్ రూమని వివరణ ఇచ్చింది.