న్యూఢిల్లీ, జూన్ 7: ‘అధిక విద్యార్హత ఉన్న అభ్యర్థులు తక్కువ అర్హతలు కల అభ్యర్థులకు ఉద్దేశించిన ఉద్యోగాలు పొందడానికి అనర్హులు’ అంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని మరోసారి చర్చకు లేవనెత్తింది. ఈ దేశంలో లక్షలాది మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు తమ విద్యార్హతకు తగిన ఉద్యోగం పొందడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్యూన్ ఉద్యోగానికి కూడా పీహెచ్డీ అభ్యర్థులు పోటీపడుతున్న పరిస్థితులు నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. తమ అర్హతకు తగ్గ ఉద్యోగాలివ్వలేని అసమర్థ ప్రభుత్వానికి ఈ విషయంలో బాధ్యత లేదా? అని పలువురు నిరుద్యోగులు అంటున్నారు.
ఒక గ్రాడ్యుయేట్ తన ఉన్నత విద్యార్హతను దాచిపెట్టి 10వ తరగతి అర్హతతో లభించే బ్యాంక్ అటెండర్ ఉద్యోగాన్ని పొందిన కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థి తక్కువ అర్హతలు గల అభ్యర్థులకు కేటాయించిన ఉద్యోగం పొందడానికి అనర్హుడని తెలిపి, అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రభుత్వ శాఖలో గ్రాడ్యుయేట్ అభ్యర్థికి అటెండర్ ఉద్యోగం ఇస్తే కేవలం 10వ తరగతి మాత్రమే చదివి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థికి అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. దీనిని అనుమతిస్తే దేశంలో ప్రతి గ్రాడ్యుయేట్ అటెండర్, అంతకన్నా దిగువస్థాయి ఉద్యోగాలకు పోటీకి వస్తారని, దీని ద్వారా తక్కువ విద్యార్హత అభ్యర్థికి భవిష్యత్లో ఉద్యోగం లభించే అవకాశమే ఉండదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఉద్యోగ నియామక కోణంలో ఇది సరైన వాదనే అయినప్పటికీ, నిరుద్యోగుల కోణంలో చూస్తే ఇది అన్యాయమని అనిపిస్తుంది. ఉన్నత చదువులు చేయడమే తాము చేసిన తప్పా అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లోని ప్యూన్, స్వీపర్, అటెండెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లాంటి ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, ఎంబీఏ, పీహెచ్డీ చదివిన వారు కూడా దరఖాస్తు చేస్తుండటం మనం గమనిస్తున్నాం. దేశంలో అర్హతకు తగ్గ ఉద్యోగం లభించడం గననంగా మారింది. 2026 ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలోని 20-29 ఏండ్ల లోపు నిరుద్యోగుల్లో 67 శాతం మంది గ్రాడ్యుయేట్లే. మరోమాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నత విద్యార్హత గల నిరుద్యోగులు తమ ఇష్టంతో తక్కువస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు ఎక్కడా ఉద్యోగాలు దొరుకక వారు దిగజారి తక్కువ అర్హత గల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఈ దుస్థితి దేశంలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నది.
‘ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ చదివిన ఒక యువకుడు టెన్త్, ఐటీఐ కనీస అర్హత గల గ్రూప్ డీ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాడంటే అది అతని తప్పెలా అవుతుంది? ఈ ఉద్యోగాలకు ప్రతి ఏడాదీ లక్షలాది మంది ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్, పీహెచ్డీలు చదివిన వారు కూడా దరఖాస్తు చేస్తున్నారంటే కేవలం నిరుద్యోగం నుంచి బయటపడటానికి వారు చేసిన ప్రయత్నమే తప్ప ఇష్టపూర్వకంగా చేసే చర్య కాదు.’ అని నిపుణులు చెప్తున్నారు. రూ. 20,000-25,000 జీతం మాత్రం వచ్చే ఈ ఉద్యోగాల్లో కనీసం ఆ మేరకైనా సంపాదించి నిరుద్యోగ పర్వం నుంచి గట్టెక్కుదామని వారంతా ఆరాటపడుతున్నారు. అలాంటి వారికి ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు శరాఘాతంలా తగిలింది.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. ఆ ఊసే మరచింది. దీంతో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఇటీవలి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దేశంలో నిరుద్యోగ దుస్థితిని కండ్లకు కట్టింది. యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకున్నట్టు నివేదిక తెలిపింది. ఏడాది వ్యవధిలో ఇదే అత్యధికం.