ముంబై, జనవరి 3: ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ప్రసూతి సౌకర్యాలు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి 6 కిలోమీటర్లు నడిచి అనారోగ్యంతో కన్నుమూసింది. సుదీర్ఘ నడక వల్ల ఆమె కడుపులోని శిశువు కూడా చనిపోవడం ఆమె కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. బీజేపీ పాలిత మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ దయనీయ ఘటన చోటుచేసుకుంది. ఈటపల్లి తాలూకాలోని ఆల్దంది తోల గ్రామంలో నివసించే ఆషా సంతోష్ కిరంగ(24) తొమ్మిది నెలల గర్భిణి. ఆల్దంది తోల ప్రధాన రహదారికి దూరంగా ఉంటుంది. సొంత ఊరిలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జనవరి 1న పేటాలోని తన సోదరి ఇంటికి భర్తతో కలసి ఆమె బయల్దేరింది.
ఆరు కిలోమీటర్లు అడవి దారిలో, కొండలు, గుట్టలు ఎక్కుతూ ఆమె పేటాకు చేరింది. 2వ తేదీన ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమెను అంబులెన్సులో హెద్రీలోని కాళీ అమ్మాల్ దవాఖానకు తరలించారు. సిజేరియన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించుకోగా అప్పటికే సమయం మించిపోయింది. బిడ్డ కడుపులోనే చనిపోగా బీపీ పెరిగి పోవడంతో గర్భిణి కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆశా వర్కర్ల ద్వారా ఆమె తన పేరు నమోదు చేసుకున్నట్లు గడ్చిరోలి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ షిండే తెలిపారు. కాలినడకన ఆరు కిలోమీటర్లు నడవడంతో ప్రసూతి నొప్పులు హఠాత్తుగా ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ఆయన చెప్పారు. తల్లీ బిడ్డను కాపాడేందుకు డాక్టర్లు విఫల యత్నం చేశారని ఆయన చెప్పారు. తాలూకా ఆరోగ్య అధికారి నుంచి నివేదిక కోరామని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు.