న్యూఢిల్లీ: ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాలతో శరీరం రక్తమోడుతున్నది. ఇక తాను బతకడం కష్టమని అతనికి తెలిసిపోయింది. చివరిసారిగా తన కుటుంబాన్ని చూడాలనుకొన్నాడు. భార్యకు ఫోన్ చేసి ‘నేను బతకకపోచ్చు. ఒక వేళ గాయాలతో నేను చనిపోతే, మన బిడ్డను జా గ్రత్తగా చూసుకో’ అంటూ నెల రోజుల తన పసిబిడ్డను తలచుకుంటూ కన్నీరుమున్నీరవుతూ చెప్పాడు.
ఇది ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాల్లో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో అమరుడైన యువ డీఎస్పీ హుమయూన్ భట్ విషాదగాథ. హుమయూన్ భట్‌కు ఏడాది క్రితమే ఫాతిమాతో పెండ్లి అయింది. మరో 15 రోజుల్లో మొదటి వివాహ వార్షికోత్సవం. ఆ దంపతులకు నెల రోజుల పసి బిడ్డ ఉన్నది. గత వారం అనంత్‌నాగ్ జిల్లా కొకెర్నాగ్లోని గడోలే అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో హుమయూన్ భట్ తీవ్ర గాయాలపాలై అమరుడైన విషయం తెలిసిందే.