న్యూఢిల్లీ : ఓ ఫోన్ నంబరుతో అనుసంధానమైన వాట్సాప్ డాటా దుర్వినియోగం కాకుండా నిరోధించే బాధ్యత సబ్స్ర్కైబర్దేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ఫోన్ నంబరు డీయాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ అయినపుడు, దాని వాట్సాప్ డాటా దుర్వినియోగమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అక్టోబరు 30న కోర్టు డిస్మిస్ చేసింది. ఏదైనా ఫోన్ నంబరును సబ్‌స్ర్కైబర్ విజ్ఞప్తి మేరకు డీయాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ చేసినపుడు, ఆ నంబరును మరొకరికి కేటాయించడానికి కనీసం 90 రోజుల వ్యవధి ఉంటుందని ట్రాయ్ తాను సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది.
ఓ మొబైల్ ఫోన్లోని వాట్సాప్ అకౌంట్ 45 రోజులపాటు ఇనాక్టివ్‌గా ఉండి, ఆ తర్వాత అదే నంబరుతో వాట్సాప్ అకౌంట్ వేరొక మొబైల్ డివైస్‌లో ప్రారంభమైతే, అంతకుముందు డివైస్‌లోని డేటాను తొలగిస్తామని వాట్సాప్ హెల్ప్ సెంటర్లో పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మొదటి సబ్స్ర్కైబర్దేనని చెప్పింది.