న్యూఢిల్లీ: తన అభిమాని రేణాకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్ట్ గురువారం రద్దు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయని, ఫోరెన్సిక్ ఆధారాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి చట్టపరమైన కారణం లేదని తెలిపింది.
దర్శన్‌కు స్వేచ్ఛ కల్పించడం వల్ల న్యాయ పాలన పట్టాలు తప్పే ప్రమాదం ఉందని చెప్పింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్ పార్దివాలా నొక్కి చెప్పారు. కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని రాష్ట్ర, జైలు అధికారులను కోర్ట్ హెచ్చరించింది. బెయిల్ రద్దవడంతో దర్శన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.