న్యూఢిల్లీ: దేశంలోని 370 జిల్లాల్లో అనాథ పిల్లల దత్తత ప్రక్రియను నిర్వహించాల్సిన ప్రత్యేక దత్తత ఏజెన్సీలు(ఎస్ఏఏ) లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్ఏఏలపై శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్ని జిల్లాల్లో ఎస్ఏఏలను ఏర్పాటు చేయాలని తాము 2023 నవంబరు 20న ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంకా 370 జిల్లాల్లో ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
వెంటనే ఈ జిల్లాల్లో ఎస్ఏఏలను ఏర్పాటు చేయకపోతే తాము తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఎస్ఏఏల ఏర్పాటు, ఇప్పటివరకు ఎన్ని దత్తతలు జరిగాయి వంటి వివరాలన్నీ ఏప్రిల్ 7 నాటికి కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అందించాలని ఆదేశించింది.