Supreme Court | న్యూఢిల్లీ, ఆగస్టు 22: శాంతియుతంగా చేసే నిరసనలను అడ్డుకోవద్దని, అంతరాయం కలిగించొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్కతా హత్యాచార ఘటనను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దని, అంతరాయం కలిగించొద్దని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఈ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు’ అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తరపు న్యాయవాది కపిల్ సిబల్తో ధర్మాసనం పేర్కొన్నది.
నిరసనలు తెలియజేస్తున్న వైద్యులు, విద్యార్థులకు ఆబ్సెంట్ వేస్తున్నారని, పరీక్షలు రాయనివ్వడం లేదని ఎయిమ్స్ నాగ్పూర్ వైద్యుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, విధులకు రాకపోయినా, హాజరైనట్టు నమోదు చేయమని తాము ఆదేశించలేమని కోర్టు పేర్కొన్నది.
న్యాయం, వైద్యం ఆగిపోవద్దు
న్యాయం, వైద్యం ఆగిపోవడానికి వీలు లేదని, వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలని కోర్టు సూచించింది. విధుల్లోకి చేరిన వైద్యులు, సిబ్బందిపై నిరసనల్లో పాల్గొన్నందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
సమ్మె విరమించిన వైద్యులు
కోల్కతా ఘటనకు నిరసనగా 11 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను వైద్యులు విరమించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ గురువారం ప్రకటించింది. ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ఎంఎల్ వైద్యులు సైతం సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆగస్టు 12 నుంచి దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం వైద్యులు హాజరయ్యారు. కాగా, పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ మాత్రం సమ్మెను కొనసాగిస్తామని చెప్పింది.
నిందితుడిలో కనిపించని పశ్చాత్తాపం
కోల్కతా: ఆర్జీ కర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ (31) హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ (33) పశు ప్రవృత్తి కలవాడని, అశ్లీలతకు బానిస అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వర్గాలు తెలిపాయి. సంజయ్ మానసిక స్థితిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం విశ్లేషించినపుడు ఈ విషయం తెలిసింది. నిందితుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని, జరిగిన ప్రతి విషయాన్నీ గుక్కతిప్పుకోకుండా వివరించాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ ఉన్నట్లు తెలిపే సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పాయి. ఈ కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.