Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 10: ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఎలా చెప్పగలరు? పంజాబ్‌లో జరుగుతున్న దానిని బట్టి మేము ఏ మాత్రం సంతృప్తిగా లేము. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నామా?’ అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై విరుచుకుపడింది. తమ ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తొక్కిపెడుతున్నారంటూ పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఇక ఎంతమాత్రం జాప్యం చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తమిళనాడు, పంజాబ్ గవర్నర్లను ఆదేశించింది. ‘చట్టబద్ధంగా ఎన్నికైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను దయచేసి పక్కదారి పట్టించకండి. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశం’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్థాపిత సంప్రదాయాలు, సూత్రాల ఆధారంగా భారతదేశం ముందుకు సాగుతున్నదని, వాటిని తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని స్పష్టంచేశారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ తొక్కి పెట్టారని.. దీని వల్ల తమ ప్రభుత్వ యంత్రాంగం నిశ్చల స్థితికి చేరుకుందని పంజాబ్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. గవర్నర్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు తన ఆమోదం తెలుపకుండా ‘నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని వ్యాఖ్యానించింది.
అసెంబ్లీ సమావేశాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించడానికి గవర్నర్‌కు ఎవరు అధికారమిచ్చారని నిలదీసింది. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే అంశంపై త్వరలోనే ఒక చట్టాన్ని రూపొందించే విషయమై ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపింది. బిల్లులకు సంబంధించి గవర్నర్ తీసుకున్న చర్యలపై తమకు నివేదిక అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
తమ రాష్ట్ర గవర్నర్ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ‘ప్రజల అభీష్టాన్ని దెబ్బతీస్తున్నారు’ అని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ.. ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి.. 12 బిల్లులను తొక్కిపెట్టారని తెలిపారు. ‘అనవసరమైన కారణాలు’ చూపుతూ తమ ప్రభుత్వం పనిచేయకుండా గవర్నర్ అడుగడుగునా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.
రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశాన్ని పాటించకుండా గవర్నర్ తన విధులను నిర్లక్ష్యం, జాప్యం చేయడాన్ని అతని వైఫల్యంగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. గవర్నర్ వైఖరి కారణంగా తమ ప్రభుత్వం ఎటువంటి పనులూ చేయలేకపోతున్నదని తెలిపారు. గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా, చట్టవ్యతిరేకమైనవిగా, ఏకపక్షమైనవిగా, అసమంజసమైనవిగా, దురుద్దేశపూరితమైనవిగా ప్రకటించాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో తమకు అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ సహకరించాలని కోరింది.