న్యూఢిల్లీ, జూన్ 11: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై సమాధానం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీట్ యూజీ పరీక్షా పత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహ్సనుద్దిన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ ఆరోపణలు నీట్ పరీక్ష పవిత్రతనే ప్రభావితం చేసేలా ఉన్న నేపథ్యంలో తమకు సమాధానాలు కావాలని కేంద్రం, ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏతో పాటు బీహార్‌లో మాల్‌ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణలతో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది.
జూలై 8న సాధారణ ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తుందని పేర్కొన్నది. ఇదే అంశంపై శివాంగి మిశ్రాతో మరో తొమ్మిది మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారించనున్నట్టు తెలిపింది. అప్పటిలోగా సమాధానాలు తెలియజేయాలని ఆదేశించింది. కాగా, నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైద్యవిద్యా ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ జరగకుండా స్టే ఇవ్వాలని విద్యార్థుల తరపు న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపర చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. స్టే విధించబోమని, కౌన్సెలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశాలకు 2022లో నిర్వహించిన నీట్-పీజీ పరీక్ష ఫలితాల్లో తేడాలు ఉన్నాయని, ఆన్సర్ షీట్లు, ఆన్సర్ కీలను బహిర్గతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. ప్రితీశ్ కుమార్, మరికొందరు అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, అహ్సనుద్దిన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. నీట్-పీజీ 2022 ఫలితాల్లో తేడాలు ఉన్నాయని, పునః ముల్యాంకనానికి ఈ పరీక్షలు నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) అంగీకరించడం లేదని పిటిషన్‌దారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, కాలం గడిచిపోతున్న కొద్దీ ఈ పిటిషన్లు వ్యర్థమైపోతాయని పేర్కొన్న ధర్మాసనం.. పిటిషన్‌ను తిరస్కరించింది.