న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్( Arjun Ram Meghwal) మాట్లాడారు. 2023లో పాసైన మహిళా రిజర్వేషన్ విధానాన్ని .. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అమలు చేయనున్నట్లు చెప్పారు. లోక్సభలో సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచనున్నట్లు చెప్పారు. 815 సీట్లకు ఆ సంఖ్య చేరుకోనున్నట్లు తెలిపారు. కోటాలో భాగంగా 272 సీట్లను మహిళలకు రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల ఏ రాష్ట్రం కూడా తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోదు అని, ప్రస్తుతం ఉన్న ఆయా రాష్ట్రాల సామర్థ్యం అలాగే కొనసాగుతుందని ఆయన అన్నారు. పురుషులకు కానీ, రాష్ట్రాలకు కానీ తాజా బిల్లులలో ఎటువంటి నష్టం ఉండబోదన్నారు. లోక్సభ సామర్థ్యం 815కి పెరిగినప్పుడు, దాంట్లో 33 శాతం అంటే 272 అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
131వ రాజ్యాంగ సవరణ 2026 బిల్లుతో మహిళలకు సమానత్వం వస్తుందన్నారు. బిల్లులపై చర్చను ప్రారంభించిన మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. తన ప్రసంగంలో అంబేద్కర్ ఆశయాలను ప్రస్తావించారు. మహిళలు ప్రగతి సాధించిన ఆధారంగానే ఆ సమాజ ప్రగతిని అంచనా వేస్తామన్న అంబేద్కర్ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని సమర్థించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యలను కూడా మంత్రి గుర్తు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే రోజులు వస్తాయని, కానీ దానికి సమయం కావాలని, అయితే ఆయన చెప్పినట్లే ఇప్పుడు సమయం వచ్చిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం చరిత్రాత్మక అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.