భువనేశ్వర్, జూన్ 4: ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు బీజేపీ ఎట్టకేలకు అడ్డుకట్ట వేయగలిగింది. మంగళవారం విడుదలైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదళ్ పరాజయం పాలైంది.
147 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు సాధించి విజయ కేతనం ఎగురవేసింది. బీజేడీ 51 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. మరోవైపు మిగతా స్థానాలను కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, స్వతంత్రులు పంచుకొన్నారు. రెండు స్థానాల నుంచి పోటీచేసిన నవీన్ పట్నాయక్ ఒకచోటనే గెలుపొందగా, మరోచోట ఓడిపోవడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవా
ఒడిశాలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబర్చింది. రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలోని అధికార బీజేడీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క సీటుతోనే సరిపెట్టుకొన్నది.
ముగిసిన నవీన్ శకం
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అత్యధిక కాలం సీఎంగా చేసి రికార్డు సృష్టించే అవకాశాన్ని నవీన్ పట్నాయక్ కోల్పోయారు. నవీన్ పట్నాయక్ 2000 మార్చిలో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా 24 ఏండ్ల 90 రోజులకు పైగా పనిచేశారు. మరోసారి గెలిచి, అధికార పీఠం ఎక్కి ఉంటే.. అత్యధిక కాలం సీఎంగా చేసిన వారిలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును పట్నాయక్ దాటేసేవారు.
చామ్లింగ్ ఆ రాష్ర్టానికి 24 ఏండ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వర్తించారు. దీర్ఘకాలం సీఎంగా చేసిన వారిలో చామ్లింగ్, నవీన్ పట్నాయక్ తర్వాతి వరుసలో జ్యోతిబసు(పశ్చిమబెంగాల్-23 ఏండ్ల 137 రోజులు), గెగాంగ్ అపాంగ్(అరుణాచల్‌ప్రదేశ్-22 ఏండ్ల 250 రోజులు), లాల్ థధ్వాల్(మిజోరం- 22 ఏండ్ల 60 రోజులు), వీరభద్రసింగ్(హిమాచల్‌ప్రదేశ్- 21 ఏండ్ల 13 రోజులు) ఉన్నారు.
2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పార్టీ : గెలిచిన సీట్లు
బీజేపీ : 78
బీజేడీ : 51
కాంగ్రెస్ : 14
సీపీఎం : 1
స్వతంత్రులు : 3
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేడీ-112, బీజేపీ-23, కాంగ్రెస్-9, సీపీఎం-1, స్వతంత్రులు-1