NEET-UG 2026 : దేశవ్యాప్తంగా 22 లక్షల మంది ఎంతో ఆశతో, ఆసక్తితో రాసిన నీట్ యూజీ పరీక్ష రద్దైన సంగతి తెలిసిందే. పరీక్ష జరిగి పది రోజులు కూడా కాకముందే విద్యార్థులు మరోసారి అదే పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. నీట్ పేపర్ లీకైనట్లు గుర్తించిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గత వారం జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఈ కేసుపై రాజస్థాన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) అనే పోలీసు విభాగం విచారణ జరుపుతోంది. తాజా సమాచారం ప్రకారం.. పరీక్ష జరగడానికి కొద్ది రోజుల ముందు కొంతమంది నీట్ అభ్యర్థులు, అధ్యాపక సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో ఒక గెస్ పేపర్ సర్క్యులేట్ అయింది. పరీక్ష జరగడానికి ఒకటిన్నర రోజుల ముందు కూడా ఈ గెస్ పేపర్ షేర్ అయింది. ఈ గెస్ పేపర్లోని అనేక ప్రశ్నలు ఒరిజినల్ నీట్ యూజీ పేపర్లో వచ్చాయి. ముఖ్యంగా కెమిస్ట్రీ పేపర్లోంచి అనేక ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి. మొత్తంగా గెస్ పేపర్లో వచ్చిన 120 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్లో ఉన్నాయి. ఈ గెస్ పేపర్లో 410 ప్రశ్నలు ఉండగా, వాటిలో 120 ప్రశ్నలు వాటిలోంచే వచ్చాయి.
అందులోనూ కెమిస్ట్రీ విభాగం నుంచే ఎక్కువ పేపర్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ అంశంపైనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో ఏదైనా చీటింగ్, క్రిమినల్ కోణం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఈ పేపర్ లీక్‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత వివాదాస్పద, కీలకమైన పరీక్ష నిర్వహణ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.