న్యూఢిల్లీ, మే 13: వాణిజ్యం ఆపేస్తానని ఒత్తిడి తెచ్చి భారత్, పాక్‌ను కాల్పుల విరమణకు ఒప్పంచానని ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. మిలిటరీ చర్యలపైనే చర్చలు జరిగాయని, వాణిజ్యం గురించి చర్చించలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. కశ్మీర్ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగుతున్నదని, ఇది భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సమస్య అని, రెండు దేశాలే వీటిని పరిష్కరించుకుంటాయని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంలో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించబోమని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
అణుయుద్ధంపై ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఆయన స్పందిస్తూ తమ సైనిక చర్య పూర్తి సంప్రదాయ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించి పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ ఈ నెల 10న సమావేశమవుతుందని వార్తలు వచ్చాయని, తర్వాత దానిని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రే తిరస్కరిస్తూ ఖండించిన విషయాన్ని జైశ్వాల్ గుర్తు చేశారు. అయినా భారత్ అణ్వస్త్ర బెదిరింపులకు భయపడదని, దానిని ప్రేరేపించే సరిహద్దు ఉగ్రవాదాన్ని అనుమతించదని, ఈ విషయంలో భారత్ దృఢమైన వైఖరిని కలిగి ఉందని రణధీర్ స్పష్టం చేశారు.