న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత్లో క్రమంగా వృద్ధుల జనాభా పెరుగుతున్నది. మరోపక్క 0-14 సంవత్సరాల వయసున్న పిల్లల సంఖ్య నిరంతరంగా తగ్గిపోతున్నదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తన 2023 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) నివేదికలో వెల్లడించింది. దేశ జనాభాలో శ్రామిక-వయో గ్రూపు (15-59 ఏళ్లు) సంఖ్య కూడా పెరుగుతున్నదని నివేదిక తెలిపింది. దేశంలో సంతానోత్పత్తి రేటు కూడా దారుణంగా పడిపోయినట్టు నివేదిక పేర్కొన్నది. 1971లో 5.2 ఉన్న సంతానోత్పత్తి రేటు 2023లో 1.9కి తగ్గిపోయినట్టు తెలిపింది. 1971-81 కాలంలో 0 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లల నిష్పత్తి 41.2 శాతం ఉండగా 2024 నాటికి అది 24.2 శాతానికి తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. గడచిన ఐదు దశాబ్దాలలో దేశ జనాభాలో పిల్లల వాటా దాదాపు 17 శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
జనాభాలో పిల్లల సంఖ్య తగ్గడం వల్ల భవిష్యత్తులో శ్రామికశక్తి క్షీణిస్తుంది. ఇది ఆర్థిక ప్రగతిని కుంటుపరుస్తుంది. చిన్న పిల్లల వల్ల కుటుంబ ఖర్చులు ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పింఛన్లు, సామాజిక భద్రతా వ్యవస్థల భారం పెరిగే అవకాశం ఉంది. ఏక సంతానం లేక సంతానమే లేని కుటుంబాలు పెరిగే కొద్దీ వృద్ధులను చూసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. అయితే తక్కువ సంతానం వల్ల పిల్లల విద్య, ఆరోగ్య రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది.
దేశంలో 15-59 ఏళ్ల వయసున్న ప్రజల సంఖ్య పెరుగుతున్నది. 1971 నుంచి 1981 మధ్య 53.4 శాతం ఉన్న ఈ గ్రూపు సంఖ్య 1991 నుంచి 2023 మధ్య 56.3 శాతానికి పెరిగింది. ఇప్పుడది 66.1 శాతానికి చేరుకుంది. ఢిల్లీలో అత్యధికంగా ఈ గ్రూపు వాటా 70.8 శాతం ఉండగా బీహార్లో అత్యల్పంగా 60.1 శాతం ఉంది. పట్టణ ప్రాంతాలలోని జనాభాలో పనిచేసే వయసు గల ప్రజల వాటా 68.8 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతాలలో అది 64.6 శాతం ఉంది. జమ్ము కశ్మీరులో గ్రామీణ మహిళల వాటా 70.1 శాతం ఉండడం విశేషం.
2023లో దేశ జనాభాలో 60 ఏండ్లు, అంతకు పైబడి వయసున్న వారి వాటా 9.7 శాతం ఉండగా కేరళలో అత్యధికంగా 15.1 శాతం ఉంది. తర్వాతి స్థానంలో తమిళనాడు(14 శాతం), హిమాచల్ ప్రదేశ్(13.2 శాతం) ఉన్నాయి. దేశంలో పూర్తి సంతానోత్పత్తి రేటు పడిపోయింది. 1971లో 5.2 ఉండగా 2023లో అది 1.9 ఉంది. గ్రామీణ ఢిల్లీలో మినహాయించి 0-14 ఏళ్ల వయసున్న బాలుర సంఖ్య బాలికల కన్నా ఎక్కువ ఉంది. దేశంలో శిశు మరణాల రేటు(ఐఎంఆర్) తగ్గింది. 2015లో 40 ఉండగా 2023 నాటికి అది 25కి దిగివచ్చింది.