కాంగ్రెస్ అంటే మోసం.. కాంగ్రెస్ అంటే నయవంచన& కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట తప్పడం.. చరిత్ర నెమరేసినా.. వర్తమానాన్ని తలుచుకొన్నా.. భవిష్యత్తులోకి తొంగిచూసినా.. వాస్తవం ఇదే! ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో మరోసారి రుజువైంది.
ఐదు గ్యారెంటీలతో కర్ణాటక ప్రజలకు ధోకా ఇచ్చిన హస్తంపార్టీ..
2 లక్షల సర్కారీ కొలువుల భర్తీపై కూడా యూటర్న్ తీసుకొంది.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను
నింపుతామన్న కర్ణాటక కాంగ్రెస్ మాటమార్చింది.
‘ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వలేం. ఐదేండ్లు ఉందిగా చూద్దాంలే!’ అంటూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
ఇప్పుడు, అదే కాంగ్రెస్ తెలంగాణలో తొలి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ మాయమాటలు చెప్తున్నది.
ఈ మాటలు నమ్మామో.. కర్ణాటక నిరుద్యోగుల్లాగే మన బిడ్డలూ ఆగమవుతారు. జాగ్రత్త!!
Karnataka | హైదరాబాద్, నవంబర్ 26 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను అటకెక్కించింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా పక్కనబెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ గత మేలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు. ఇదే అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. కాంగ్రెస్ మాటలు నమ్మిన లక్షలాదిమంది నిరుద్యోగులు తమ బతుకులు బాగుపడుతాయన్న ఆశతో ఆ పార్టీకి ఓటేశారు. అయితే, అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనప్పటికీ, ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఇదే విషయమై తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం సిద్ధరామయ్యను ఆదివారం హైదరా బాద్లో మీడియా ప్రశ్నించింది.
‘కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆరు నెలలు గడిచినప్పటికీ, ఆ హామీని నెరవేర్చలేదు’ అని ఓ విలేకరి సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘తొలి దశలో మేము 5 గ్యారంటీలను నెరవేర్చాం. అలాగే 76 హామీలను కూడా పూర్తి చేశాం. మ్యానిఫెస్టోలోని అన్ని హామీలను ఒకేసారి నెరవేర్చలేం. మ్యానిఫెస్టో అంటేనే ఐదేండ్లు’ అని చెబుతూ.. ఉద్యోగాల భర్తీపై అప్పట్లోపు చూస్తామన్నట్టు బదులిచ్చారు. ఉద్యోగాల భర్తీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్ణాటక నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇస్తామన్న నిరుద్యోగ భృతిని కూడా సర్కారు ఇవ్వట్లేదని వాపోతున్నారు.
కర్ణాటక నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ ప్రజలను కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నది. తొలి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించడమే కాదు.. జాబ్ క్యాలెండర్ను కూడా మ్యానిఫెస్టోలో విడుదల చేసింది. దీనిపై తెలంగాణ మేధావులు మండిపడుతున్నారు. ‘కర్ణాటకలో చేయలేనిది ఇక్కడ ఎలా చేస్తారని?’ నిలదీస్తున్నారు.
రాజ్యాంగబద్ధమైన టీఎస్పీఎస్సీ, ఇతర నియామక ఏజెన్సీలు ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ను ఒక పార్టీ ప్రకటించడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. 2004-14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు 24,086 కాగా, అందులో తెలంగాణ పది జిల్లాల వాటా 42 శాతం అనుకుంటే.. దక్కినవి కేవలం 10,116 ఉద్యోగాలే. కాంగ్రెస్కు అంత చిత్తశుద్ధి ఉంటే 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఎందుకు భర్తీ చేసిందని మేధావులు అడుగుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో గడిచిన పదేండ్లలో (2014-23) 2,32,308 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. అందులో నియామక సంస్థలు 27 శాఖల్లో 2,02,735 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇప్పటివరకూ 1,60,083 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరో 42,652 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ రాకుంటే.. అవికూడా ఇప్పటికే పూర్తియిపోయేవి. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 16 రెట్లు ఎక్కువ ఉద్యోగాల భర్తీ జరిగింది. కాంగ్రెస్ పాలనలో ఏడాదికి సగటున 1,012 ఉద్యోగాలు భర్తీ జరిగితే.. బీఆర్ఎస్ పాలనలో 2014 తర్వాత ఏడాదికి సగటున 16,850 ఉద్యోగాలను భర్తీ జరిగింది.