Delhi Liquor Scam | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తంచేసింది. స్టేట్మెంట్ల సాయంతో తప్ప.. ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడింది. అప్రూవర్ చెప్పిన వివరాలనే ఈడీ ప్రామాణికంగా తీసుకోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. వంద కోట్ల అక్రమాలు జరిగినట్టు చెప్తున్న ఈడీ.. నగదును మాత్రం లక్షల్లోనే చూపించడంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ విస్మయం వ్యక్తంచేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం రాజేశ్ జోషి, వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు.
మద్యం పాలసీలో అక్రమ లావాదేవీలు జరిగాయనడానికి ఈడీ తగిన ఆధారాలు చూపించట్లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కీలక వ్యాఖ్య లు చేసింది. ‘సౌత్‌గ్రూప్ రూ.30 కోట్లు ఇచ్చిందని అప్రూవర్ దినేశ్ చెప్తున్నారు. ఆరోపణలు కోట్ల రూపాయల్లో ఉండగా.. నగదు మాత్రం లక్షల్లోనే కనిపిస్తున్నది. ఇంత భారీ అవినీతి వ్యవహారంలో హవాలాకు పాల్పడిన వాళ్లను ఎవరినీ ఈడీ విచారించలేదు. కేవలం కేసులోని వాళ్లు, అప్రూవర్ల స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ ఈ కేసులో ముందుకు వెళ్తున్నది’ అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. నగదును స్వాధీనం చేసుకోవడం, డబ్బులు తరలించిన హవాలా ఆపరేటర్లను విచారణ చేసిన ఈడీ ఇప్పటివరకు ముఖ్యమైన సాక్ష్యాధారాలేవీ చూపలేదని పేర్కొన్నది. ‘మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్-45 నాన్ బెయిలబుల్ సెక్షన్. అయితే అందుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాల్ని చూపలేకపోయింది’ అని ఈడీ దర్యాప్తు తీరును తప్పుపట్టిన న్యాయస్థానం.. ఈ కారణంగానే నిందితులు రాజేశ్ జోషి, మల్హోత్రాకు బెయిల్ ఇస్తున్నట్టు స్పష్టంచేసింది.
అప్రూవర్ చెప్పిన వివరాలను బట్టి ఈడీ కేసు దర్యాప్తును కొనసాగించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘మద్యం పాలసీ తయారీలో రాజేశ్‌కు ఏ విధమైన ప్రమేయమూ లేదు. హవాలా ఆపరేటర్ ద్వారా రూ.30 కోట్లను ఆప్ నేతలు గోవా ఎన్నికలకు వినియోగించారన్నది కేవలం అభియోగాలు మాత్రమే. ఇవి కూడా అప్రూవర్ దినేశ్ చెప్పిన వివరాల మేరకు ఈడీ చార్జిషీట్లో నమోదు చేసింది. అయితే, హవాలా ఆపరేటర్లను ఎవరినీ ఈడీ విచారణ చేయలేదు. కాబట్టి సెక్షన్-45లో చెబుతున్న తీవ్రత కనిపించడం లేదు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద నిందితులను నిర్బంధంలో కొనసాగించడం సరికాదు. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వుల్లో పేరొన్నది. ‘మల్హోత్రా విషయానికి వస్తే.. ఆయన క్రెడిట్ నోట్స్ తయారు చేశారన్నది అభియోగం మాత్రమే. ఇది కూడా స్టేట్మెంట్ల ఆధారంగా నమోదు చేసినవే. ఈ స్టేట్మెంట్లు కూడా రెండుమూడు చోట్ల పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి బెయిల్‌కు మల్హోత్రా కూడా అర్హుడే’ అని న్యాయమూర్తి వివరించారు.
ఈ పాలసీ ద్వారా రూ.100 కోట్లు చేతులు మారాయని చెప్పడానికి ఈడీ ఇప్పటివరకూ రుజువులేవీ చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం అప్రూవర్, ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగా దర్యాప్తును ఈడీ ముందుకు తీసుకుపోతుండటాన్ని తప్పుబట్టింది. భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలకు ప్రాథమికంగా సాక్ష్యాధారాలు కనిపించట్లేదని తేల్చింది. మౌఖిక, డాక్యుమెంటరీ సాక్ష్యాలనే ఈడీ ఇప్పటివరకూ చూపుతున్నదని అభిప్రాయపడింది.
ఆ డబ్బును గోవా ఎన్నికల ప్రచారానికి వినియోగించారన్న అభియోగంలో రాజేశ్ జోషి ప్రమేయం కూడా ఉం దన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా జోషికి చెందిన కంపెనీ నుంచి ఈడీ ఎలాంటి నగదునూ స్వాధీనం చేసుకోలేదు. హవాలా మార్గం ద్వారా కోట్ల రూపాయల నగదు చేతు లు మారాయనేందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఏమీ చూపలేదు’ అని కోర్టు తెలిపింది.
హవాలా ఏజెంట్లను పట్టుకుని విచారణ చేసినట్టు కూడా ఈడీ చూపలేకపోయిందని న్యాయస్థానం పేర్కొన్నది. కోట్ల రూపాయల హవాలా చేసిన ఒక ఆపరేటర్ వాంగ్మూలాన్నీ ఈడీ నమోదు చేయకపోవడాన్ని న్యాయమూర్తి ఈ సందర్భంగా తప్పుపట్టారు. మల్హోత్రా లంచాలు ఇచ్చినట్టు గా ఈడీ ఎటువంటి ఆధారాలనూ చూపలేకపోయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ‘మద్యం విక్రయాలను పెంచుకోవడానికి వ్యాపారపరంగా కార్టెల్‌ను సృష్టించారు. రాజేశ్ జోషిపై కూడా అప్రూవర్ దినేశ్ చేసిన అభియోగాలు మాత్రమే ఉన్నాయి. ఇత ర సాక్ష్యాధారాలేవీ లేవు’ అని కోర్టు గుర్తు చేసింది. అందుకే ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. ఇద్దరూ కేసు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ప్రముఖ వ్యాపారి శరత్‌చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు సాధారణ బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసింది. భార్య అనారోగ్య కారణాలరీత్యా పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయాలన్న శరత్‌చంద్రారెడ్డి విజ్ఞప్తిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత.. భార్య అనారోగ్యం దృష్ట్యా శరత్ చంద్రారెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇంతకుముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాధారణ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.