భారత్-నేపాల్ సరిహద్దును ఉత్తరాఖండ్‌లోని సమీప గ్రామస్థులు ఇటీవల తరచూ దాటుతున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే… దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పక్క దేశానికి సాహసం చేసి మరీ వెళ్తున్నట్టు తెలిసింది. థానేలో ఓ మహిళ తన పుట్టినరోజు సందర్భంగా 4 కిలోల టమాటాలను బహుమతిగా అందుకున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు ధరలను అదుపు చేయడంలో ముందు చూపు లేదనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం.
న్యూఢిల్లీ, జూలై 17: కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలోని సామాన్యులు పస్తులుంటున్నారు. ఒక్క పూట తిండి తినేందుకు తిప్పలు పడుతున్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు పేదోడి పొట్ట కొడుతున్నాయి. మోదీ సర్కార్ తీరుతో పేదోడి బతుకు భారంగా మారింది. నిత్యావసరాల ధరలు జూలైలో గరిష్ఠానికి చేరుకున్నాయి. కేంద్ర ఇబ్బడిముబ్బడి పన్నుల బాదుడుతో పెట్రోల్, డీజిల్, వంటనూనెలు తదితర నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తాజాగా పెరిగిన కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూన్‌లో కిలో రూ.20కే లభించిన టమాటాల ధర ప్రస్తుతం రూ.250కి చేరింది. మిర్చి, బీన్స్, ఆలుగడ్డలు తదితర కూరగాయల ధరలు టమాటాతో పోటీపడి పరుగులు తీస్తున్నాయి. అల్లం, ధనియాలు, పచ్చి బఠానీల ధరలు రెట్టింపయ్యాయి. రూ.400కి చేరిన ఎండు మిరపకాయల ధరలు తినకముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని సామాన్యులు వాపోతున్నారు. పప్పుదినుసుల ధరలు మూడు శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది.
మెనూ నుంచి టమాట మాయం
పెరిగిన ధరల కారణంగా మెక్‌డొనాల్డ్స్ తన మెనూ నుంచి టమాటాలను తొలగించింది. అనేక రెస్టారెంట్లు ఇదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు టమాటాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించే పురీ, కెచెప్లకు డిమాండ్ భారీగా పెరిగింది. వీటికి ఐదు రెట్ల డిమాండ్ పెరిగిందని, భారీగా ఆర్డర్లు వస్తున్నాయని అమెజాన్ తెలిపింది.
ప్రభుత్వ పాలసీలు విఫలం
ధరలు పెరుగుతున్నా సామాన్యుడి ఆదాయం మాత్రం పెరగడం లేదు. 2017లో 29.2 శాతం ఉన్న ఆదాయం పెరుగుదల 2020లో 6.7, 2021లో 8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో 2017లో 4.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 2020లో 4.8, 2021లో 5.5 శాతానికి చేరుకున్నది. రోజంతా కష్టపడి సామాన్యుడు సంపాదిస్తున్న కొద్దిపాటి వేతనం.. ధరల కారణంగా ఆవిరైపోతున్నది. మరోవైపు ఔషధాలు కొనుగోలు చేసేందుకు సీనియర్ సిటిజన్లు అవస్థలు పడుతున్నారు. ధరల పెరుగుదలతో పొదుపు మూడు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయింది. భారత్‌లో ఆర్థిక సర్వేను మూస పద్ధతిలో నిర్వహిస్తారని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వ పాలసీలు సామాన్యుడికి ఏం కావాలో ప్రతిబింబించడంలో విఫలమవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తులోనూ తప్పని తిప్పలు…
భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో దేశంలో పంటల సాగు నెమ్మదించింది. కొన్ని రాష్ర్టాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో 5.5 శాతానికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.