Dimple Yadav : నియోజవర్గాల పునర్విభజన (Delimitation) పై కేంద్రం తొందరపాటు వెనుకగల వ్యూహం ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉన్నదని సమాజ్వాది పార్టీ ఎంపీ (Samajwadi Party MP) , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సతీమణి డింపుల్ యాదవ్ (Dimple Yadav) అన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) కు ఆమోదం తెలిపిన సందర్భంలో కేంద్రం స్పందిస్తూ.. ముందుగా జనగణన చేపడుతామని, జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని చెప్పిందని ఆమె గుర్తుచేశారు. జనగణన జరగకుండానే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ఎందుకు తహతహలాడుతుందో అర్థం కావడంలేదన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జనగణన చేపట్టడం చాలా ముఖ్యమని, అప్పుడే ఓబీసీ, మైనారిటీ మహిళకు న్యాయంగా మహిళా రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని డింపుల్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు మద్దతు పలుకుతున్నదో ఒకసారి ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనతో చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుందని, భవిష్యత్తులో కేంద్రానికి ఆ రాష్ట్రాల అవసరమే లేకుండా పోవచ్చునని ఆందోళన వ్యక్తంచేశారు.
అసలు కేంద్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను ఎలా చేపడుతుందని డింపుల్ యాదవ్ ప్రశ్నించారు. కేవలం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కారు నియోజకవర్గాల పునర్విభజనకు ఉవ్విళ్లూరుతున్నదని విమర్శించారు.