రంగంలోకి యుద్ధ విమానాలు.. లాక్డౌన్లో ప్రశ్నపత్రాల రూపకర్తలు.. టెలిగ్రామ్ యాప్‌పై నిషేధం.. స్వయంగా పీఎంవో పర్యవేక్షణ.. సీసీటీవీలతో నిరంతర నిఘా.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. ఇదంతా చూస్తుంటే ఏదో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు ఉంది కదూ! నీట్ యూజీ పేపర్ లీక్ కావడంతో అభాసుపాలైన కేంద్ర ప్రభుత్వం.. 21న నిర్వహించే రీఎగ్జామ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు ఇవి. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యుద్ధం తరహాలో ఏర్పాట్లు చేస్తుండటం విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నది. వారిపై మరింత ఒత్తిడిని పెంచుతున్నది.
న్యూఢిల్లీ, జూన్ 19: నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా అభాసుపాలైన కేంద్రం ఈసారి ఎలాగైనా దానిని పకడ్బందీగా నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నెల 21న జరిగే నీట్ రీటెస్ట్‌కు విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏదో యుద్ధానికి చేస్తున్నట్టుగా మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఈసారి నీట్ పునః పరీక్ష ఇటు విద్యార్థులకే కాదు అటు కేంద్రానికి కూడా కఠిన పరీక్షగా మారింది. పరీక్షలో మంచి మార్కులతో మెడిసిన్ సీట్ కోసం అభ్యర్థులు తపన పడుతుండగా, లోపరహితంగా పరీక్ష నిర్వహించి ప్రభుత్వంపై మరో మచ్చ పడకుండా బయటపడాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. ఎక్కడ మళ్లీ పేపర్ లీక్ అవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నది. దీని కోసం ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా రంగంలోకి దిగి పరీక్ష ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నది.
నీట్ రీటెస్ట్-2026కు కేంద్రం చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే ఒక ప్రవేశ పరీక్షకా లేక యుద్ధానికా ఏర్పాట్లు చేస్తున్నది అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇది అతిశయోక్తిగా అనిపించినప్పటికీ యుద్ధ విమానాల ద్వారా పరీక్ష పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. ఎన్నడూ లేని విధంగా పరీక్ష సన్నాహాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శనివారం మాక్‌డ్రిల్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్ పేపర్ ఎట్టిపరిస్థితుల్లో లీక్ కారాదన్న భయంతో పేపర్ లీక్‌కు అవకాశాలు ఉన్న అన్ని మార్గాలను మూసివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఎలాంటి ప్రశ్న పత్రాలు ఆన్లైన్లో సర్క్యులేట్ కాకుండా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల రూపకర్తలకు లాక్డౌన్ విధించింది.
దేశంలోని అన్ని ప్రాంతాలకు నీట్ ప్రశ్నపత్రాలను సురక్షితంగా చేర్చేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఒక భారీ వైమానిక లాజిస్టిక్స్ మిషన్‌ను చేపట్టింది. దీని కోసం ఐఏఎఫ్ గత నాలుగు రోజుల నుంచి 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నది. జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయించాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఇక భద్రతా పర ఏర్పాట్ల విషయానికొస్తే మొబైల్ జామర్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, రెండు అంచెల తనిఖీలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నిఘాలో పరీక్ష కేంద్రాలను ఉంచింది. ఇవన్నీ చూసిన అభ్యర్థులు అసలేం జరుగుతుందో తెలియక బెంబేలెత్తుతున్నారు.
దేశ వ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించే నీట్ రీటెస్ట్‌కు 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షల కోసం రెండు లక్షల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, సెంటర్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు ఉంటారు. వీరికి సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం నుంచి పోలీసులు, ఎస్కార్టు బృందాలు కూడా ఉంటాయి. బహుళ అంచెల భద్రతా చర్యలు అమల్లో ఉంటాయి. గోప్యమైన పరీక్షా సామగ్రిని భద్రపర్చడం, రవాణా చేయడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా ఉంటుంది. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు అభ్యర్థుల తనిఖీ తప్పనిసరి. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నిర్ధారణ తప్పనిసరి. ఇక పరీక్షా కేంద్రాలు విద్యుత్ బ్యాకప్, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
నీట్ రీటెస్ట్ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయిలో ఏర్పాట్లు, గోప్యమైన సైనిక స్థాయి భద్రత, ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వంటి చర్యలు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నీట్ అభ్యర్థులకు సరికొత్త సమస్యలు తెచ్చిపెడతాయని తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. నీట్ పునః పరీక్ష కోసం ఇంత భారీ స్థాయి ఏర్పాట్లు వారి యువ హృదయాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయన్నారు. నీట్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ లీక్ కాకూడదన్న ఏకైక లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నదే తప్ప దాని కోసం తీసుకుంటున్న చర్యలు అభ్యర్థులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో పట్టించుకోవడం లేదని అన్నారు.
పరీక్షకు సంబంధించి ఎన్టీఏ అభ్యర్థులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మొబైల్ ఫోన్, స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ డివైజ్‌లు, ఇయర్ ఫోన్లు, లోహ వస్తువులు, పెద్ద బకెల్స్ ఉన్న బెల్ట్‌లు, భారీ జ్యువెలరీ, యాక్సెసరీస్‌తో అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అయితే అభ్యర్థులు మతపరమైన చిహ్నాలు ధరించొచ్చు. కలవ, తలపాగా, హిజాబ్ లేదా అలాంటి తరహా వస్తువులతో పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. తేలికపాటి దుస్తులు, పూర్తి చేతుల దుస్తులు, ఉలెన్ బట్టతో ఉన్న దుస్తులు ధరించొచ్చు. పారదర్శకంగా ఉన్న నీటి సీసా తీసుకు రావొచ్చు.
నీట్ రీటెస్ట్ ఏర్పాట్లలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం దేశవ్యాప్తంగా ఒక మాక్‌డ్రిల్‌ను నిర్వహించనుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మాక్‌డ్రిల్‌లో దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది పాల్గొననున్నారు. ఇప్పటికే పరీక్షలు జరిగే కేంద్రాలను ఎన్టీఏ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. పరీక్ష జరిగే రోజు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
నీట్ రీ ఎగ్జామ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు, ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్‌ను నమ్మవద్దని తెలిపిన ఎన్టీఏ అభ్యర్థులకు కోసం 917827980287 నంబర్‌తో అధికారిక వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూ టిక్ ఉంటుంది. అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పరీక్షకు సంబంధించిన అప్డేట్లు ఈ నంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ తెలిపింది. బ్లూ టిక్ లేకుండా వచ్చే ఏ సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. ఈ నంబర్ నుంచి వాట్సాప్ నోటిఫికేషన్లతో పాటు, అభ్యర్థులు తన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. అధికారిక ఎస్ఎంఎస్లు NICPEP అనే సెండర్ ఐడీ నుంచి, ఈ మెయిల్స్ no-reply.neet.nta@nic.in నుంచి మాత్రమే వస్తాయని తెలిపింది. మే 3న పరీక్ష కోసం జారీ చేసిన అడ్మిట్ కార్టు ఈ రీ ఎగ్జామ్‌కు చెల్లదని స్పష్టం చేసింది.
నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా, నీట్-యూజీ రీ ఎగ్జామ్ నేపథ్యంలో మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ను తాత్కాలికంగా నిషేధించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.