న్యూఢిల్లీ, జూన్ 7: నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ కావడం ద్వారా ఈ వివరాలు (సిటీ ఇంటిమేషన్ స్లిప్) పొందవచ్చునని తెలిపింది. పేపర్ లీక్ ఆరోపణలతో మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే.
జూన్ 21న మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈసారి కూడా పెన్-పేపర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించబోతున్నారు. మరోవైపు, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నది.