హైదరాబాద్, ఏప్రిల్ 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థల పాలిట శాపంలా మారింది. నిధుల సమీకరణే (మానిటైజేషన్) లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పెట్టుబడులను ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దేశ ఆర్థికానికి కీలకమైన 12 ప్రభుత్వ రంగాలను ఐదేండ్లపాటు ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకొన్నది. తద్వారా రూ.16.72 లక్షల కోట్లను రాబట్టవచ్చని భావిస్తున్నది. ఈ మేరకు ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ 2.0’ పేరిట నీతిఆయోగ్ రూపొందించిన కార్యాచరణను కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకూ అంటే వచ్చే ఈ ఐదేండ్లపాటు 12 కీలక ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఆస్తులు, సేవలు, వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. తద్వారా రూ.16.72 లక్షల కోట్లను సమకూర్చుకోవచ్చని అంచనాకు వచ్చింది. ప్రైవేట్‌పరం చేసే ఆస్తులు, వ్యవస్థల జాబితాలో జాతీయ రహదారులు, విద్యుత్తు, పోర్టులు, రైల్వే, బొగ్గు, గనులు, పెట్రోలియం, గ్యాస్, విమానయానం, పట్టణాల్లోని ఇన్ఫ్రా, వేర్‌హౌజ్‌లు, టెలికం, పర్యాటకం తదితరాలు ఉన్నాయి.
దేశ ఆర్థిక రంగానికి ఆయువు పట్టుగా పిలిచే 12 ప్రభుత్వ రంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే కేంద్రం ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ 2.0’ పైప్‌లైన్‌ను తీసుకొచ్చిందని విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. మానిటైజేషన్‌లో భాగంగా ఆచరించనున్న కొన్ని పద్ధతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం పేర్కొన్న డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్‌వోటీ), ఆపరేట్, మెయింటెయిన్, ట్రాన్స్ఫర్ (ఓఎంటీ) పద్ధతులు ప్రభుత్వ రంగ వ్యవస్థలను తెగనమ్మడానికి రాచమార్గమని ఆరోపిస్తున్నారు.
డీబీఎఫ్‌వోటీ, ఓఎంటీ పద్ధతుల్లో ఒప్పందం జరిగితే, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆయా ప్రభుత్వ రంగ ఆస్తులు.. ప్రైవేట్‌రంగ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నదని, అలాంటప్పుడు ఐదేండ్ల వ్యవధి అనే నిబంధన గాలికొదిలేసినట్టేనని గుర్తు చేస్తున్నారు. లీజు పేరిట ఐదేండ్లపాటు ప్రభుత్వ ఆస్తులను.. ప్రైవేటుకు ఇవ్వడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని మోదీ కి పలువురు హితవు పలుకుతున్నారు.

