ముంబయి: మహారాష్ట్రలో 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం, ధన బలం, ఈవీఎంలు తారుమారు చేయటం.. తమ ఓటమికి దారి తీశాయని విపక్ష కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్) ఆరోపించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో 207 స్థానాల్లో అధికార ‘మహాయుతి కూటమి’ విజయం సాధించింది. విపక్ష కూటమి 44 స్థానాల్లో గెలిచింది. ఈ తరుణంలో తమ ఓటమికి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం సహకారంతో మహాయుతి కూటమి విజయం సాధించిందని ఆరోపించారు. అందుకు ఈసీని అభినందిస్తున్నట్టు వ్యంగ్యంగా విమర్శించారు. మహాయుతి కూటమి పెద్ద మొత్తంలో డబ్బులను కుమ్మరించిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలనే స్థానిక ఎన్నికల్లో వాడారని ఆయన అన్నారు.
అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్వర్గం) పార్టీలు సాధించిన ఫలితాలే..మళ్లీ వచ్చాయని ఆయన ఉదహరించారు. గతంలో లేనివిధంగా ఈసారి అధికార పార్టీ నాయకులు హెలికాప్టర్లు, చార్టెడ్ ఫ్లైట్స్లో ప్రయాణిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారని సంజయ్ రౌత్ అన్నారు. స్థానికంగా బీజేపీ బలం, ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాతో ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్టు సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు.