న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాల సందర్భంగా లోక్ సభలో రెండో రోజు శనివారం కూడా వాడి వేడి చర్చ జరిగింది. డీఎంకే ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సామ్యవాదం పదాలను చేర్చి ఉండకపోతే, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేసి ఉండేదని ఆరోపించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆరెస్సెస్, హిందూ మహా సభ పాత్ర ఏమిటో చెప్పాలని అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో భారతీయత లేదని సావర్కర్ అన్నారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడుతున్న బీజేపీ తన సుప్రీం లీడర్‌ను అవమానిస్తున్నదని వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిస్తూ, భారత దేశ ప్రాచీన ప్రజాస్వామిక మూలాలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మన ఐక్యతకు ప్రాతిపదిక మన రాజ్యాంగమేనన్నారు. నెహ్రూ కుటుంబం రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనకు బీజం వేసిందని ఆరోపించారు.