న్యూఢిల్లీ, జూన్ 24: లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. ఎమర్జెన్సీపై అధికార విపక్షాల నడుమ వాగ్యుద్ధం నడిచింది. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మచ్చ అని ప్రధాని మోదీ విమర్శించగా.. గత పదేండ్లలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీల చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు. తొలుత ప్రధాన మంత్రి, సభా నాయకుడు నరేంద్ర మోదీ, ఆ తర్వాత క్యాబినెట్ మంత్రులు వరుసగా ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం చేసే సమయంలో విపక్ష పార్టీల సభ్యులు రాజ్యాంగం పుస్తకాలు చేతిలో పట్టుకొని నిలబడ్డారు.తొలిరోజు 262 మంది సభ్యులు ప్రమాణం చేయగా, మిగిలిన సభ్యులు మంగళవారం చేయనున్నారు. కాగా, అంతకుముందు ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ చేత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
లోక్‌సభ తొలి సమావేశాల నేపథ్యంలో మొదటి రోజున అధికార, విపక్ష పార్టీల మధ్య ‘ఎమర్జెన్సీ’ అంశం కీలక టాపిక్‌గా మారింది. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో(జూన్ 25) 50 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అదొక మచ్చ అని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి, దేశాన్ని జైలుగా మార్చారని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. 50 ఏండ్ల క్రితం నాటి ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న ప్రధాని.. గత పదేండ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతున్నారనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారని విమర్శించారు.
నీట్ పరీక్ష లీకేజీ, అక్రమాల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని విపక్ష ఎంపీలు పేర్కొన్నారు. విద్యార్థుల కష్టాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా ఎన్నికయ్యారు. సోమవారం దిగువ సభలో ప్రమాణ స్వీకారం చేసిన నడ్డా గతంలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్థానంలో రాజ్యసభ సభా నేతగా వ్యవహరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, రాజ్యసభ విపక్ష నేతగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు. రాజ్యసభలో నడ్డాతో పాటు 11 మంది కేంద్ర మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు.
భువనేశ్వర్, జూన్ 24: కేంద్రంలో బీజేపీకి ఇకపై మద్దతిచ్చే ప్రసక్తే లేదని బీజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఆయన సొమవారం పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాజ్యసభలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని పట్నాయక్ ఈ సందర్భంగా ఎంపీలకు సూచించారు.