(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 20, (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో పెంచిన రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయడానికి న్యాయ నిపుణులతో కలిసి మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. కర్ణాటకలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయే కావటంతో ఆ రాష్ట్ర అభ్యర్థనపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందని తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు వేచిచూస్తున్నాయి.
కేంద్రంలో ఉన్నది బీజేపీయే కాబట్టి, రిజర్వేషన్ల పెంపునకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నది. రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఇస్తే.. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు ఎందుకు స్పందించటం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది. కర్ణాటకలో రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం అనుమతి ఇస్తే, పరోక్షంగా తెలంగాణలోనూ రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టే.
కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచింది. విద్య, ఉపాధి కల్పనల్లో రిజర్వేషన్ శాతాన్ని ఎస్సీలకు 15 నుంచి 17కి, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. మొత్తం రిజర్వేషన్ల శాతం 50కి మించరాదు. కర్ణాటకలో ఈ రిజర్వేషన్లు పెంచితే మొత్తం రిజర్వేషన్లు 56 శాతానికి పెరుగుతాయి.
తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్ను 6 నుంచి 10 శాతానికి పెంచటంతో మొత్తం రిజర్వేషన్ శాతం 54కు చేరింది. ఉమ్మడి ఏపీలో ఈ వర్గానికి రిజర్వేషన్ 6 శాతమే. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్టీల జనాభాకు అనుగుణంగా మరో 4% రిజర్వేషన్ పెంచాలని 2016లో అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆరేండ్లు దాటినా దీనిపై కేంద్రం నుంచి స్పందన లేదు. తమిళనాడులో రిజర్వేషన్లు 69%. దీనికి పార్లమెంటు అనుమతించింది కూడా. అక్కడ 69శాతానికి అనుమతించిన కేంద్రం.. తెలంగాణలో ఎందుకు ఆమోదం తెలపడం లేదని రాష్ట్రసర్కారు కేంద్రాన్ని నిలదీస్తున్నది.
బెంగళూరు(నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంపు కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. త్వరలోనే గవర్నర్ ఆమోదానికి పంపనున్నది.